కమలంలోకి మ‌హారాజుల వార‌సుడు

తాండూరు రాజకీయం వికారాబాద్

కమలంలోకి మ‌హారాజుల వార‌సుడు
– త్వ‌ర‌లో తీర్థం పుచ్చుకుంటున్న న‌రేష్ మ‌హ‌రాజ్
– పెద్దలతో మంత‌నాలు, చేరికకు కార్యాచరణ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా రాజ‌కీయాల‌లో తాండూరు నుంచి మ‌హ‌రాజుల కుటుంబానికి మంచి పేరు ఉంది. అలాంటి కుటుంబం నుంచి దివంగత మంత్రి చందుమహారాజ్ తనయుడు నరేష్ మ‌హారాజ్ క‌మ‌ల‌ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమైన‌ట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో మహా రాజుల కుటుంబానికి ఉన్న గుర్తింపును ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దశాబ్దాల కాలం రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. మహారాజుల కుటుంబం నుంచి ఎమ్మెల్యేలుగా మంత్రులు ఎమ్మెల్సీలుగా పని చేశారు. మాజీ మంత్రి మాణిక్ రావు, చందుమహారాజ్ మరణానంతరం రాజకీయాల‌లో వారి వార‌సులు ప్రాభవం చూపలేకపో యారు. ఎలాగైనా తండ్రి చందుమహరాజ్ వారస త్వాన్ని అందిపుచ్చుకోవాలని నరేశ్ మహారాజ్ దశా బ్ధ కాలంగా యత్నిస్తున్నారు. 2014లో బీజేపీ, టీడీ పీల ఉమ్మడి అభ్యర్థిగా తాండూరు అసెంబ్లీకి పోటీ చేశారు. టీఆర్ఎస్ ప్రభావం అధికంగా ఉండటంతో ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన టీఆర్ఎస్ చేరినా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. అయితే కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి టిక్కెట్ లభించ‌క పోవ‌వ‌చ్చ‌ని భావించి బీజేపీలో చేరేందుకు సిద్ద‌మైన‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే గ‌త నెల‌లో న‌రేష్ మ‌హ‌రాజ్ ఢిల్లీలో బీజేపీ నేత శ్యామ్ జాజును కలిశారు. తాజాగా ఇదే విష‌యంపై బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ త‌రుణ్ చుగ్‌తో భేటి అయ్యార‌ని తెలిసింది. దీంతో బీజేపీలో మ‌హారాజ‌ల వారసుడు న‌రేష్ మ‌హ‌రాజ్ చేరిక ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదే నెల‌లో చేరిక ఉంటుంద‌ని స‌న్నివ‌ర్గాల స‌మాచారం.