తాండూరుకు అవిశ్వాసం సెగ..!
– కలెక్టరేట్‌కు వ్యతిరేక కౌన్సిలర్లు
– జతకట్టిన కాంగ్రెస్, టీజేస్, ఎంఐఎం
– ఆమోదం కోసం బీజేపీ నుంచి సంతకాలు..?
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పీఠానికి అవిశ్వాస సెగ తగలతోంది. దీనిని నిజం చేసేందుకు చైర్ పర్సన్ వ్యతిరేక కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లారు. మున్సిపల్ వైస్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలుతో పాటు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు తరలివెళ్లగా కాంగ్రెస్, టీజేఎస్, ఎంఐఎం కౌన్సిలర్లు జతకట్టారు. గత మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోగా తెలంగాణ రాష్ట్రంలోని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం రెండో సారి బీఆర్ఎస్ పార్టీని వరించింది. అయితే చైర్ పర్సన్ పదవి ఎన్నిక సమయంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్థానానికి స్వప్న పరిమళ్, పట్లోళ్ల దీపా నర్సింలు మద్య పోటీ ఏర్పడింది. అప్పట్లో ఇద్దరి మద్య చైర్ పర్సన్ పదవిని రెండున్నరేళ్లు పంచుకోవాలని ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. చేసుకున్న ఒప్పందం మేరకు స్వప్న పరిమళ్ చైర్ పర్సన్ పదవి నుంచి దిగకపోవడంతో వైరం ఏర్పడింది. దీంతో వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు వర్గం, కౌన్సిలర్లు చైర్ పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. కొత్త మున్సిపల్ చట్ట ప్రకారం ఇటీవలే మూడేళ్లు పదవి కాలం పూర్తి కావడంతో అవిశ్వాసం పెట్టేందుకు వారికి అనుకూలంగా మారింది. దీంతో శనివారం వైస్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలుతో పాటు కౌన్సిలర్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు తరలివెళ్లారు. వైస్ చైర్ పర్సన్‌కు మద్దతుగా అధికార పార్టీ నుంచి 10 మంది కౌన్సిలర్లు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ నుంచి ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి, టీజేఎస్ ఫ్లోర్ లీడర్ సోమశేఖర్‌తో పాటు ఎంఐఎం పార్టీకి చెందిన కౌన్సిలర్లు మద్దతుకు సిద్దమయ్యారు. మద్దతు కోసం బీజేపీ నుంచి కౌన్సిలర్ల ద్వారా సంతకాలు సేకరించినట్లు తెలిసింది. శనివారం వ్యతిరేక కౌన్సిలర్లు అవిశ్వాసానికి జై కొట్టడంతో చైర్ పర్సన్ పదవికి సెగ తగిలినట్లుగా కనిపిస్తోంది. వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అనేది రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

