పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్
– పేద‌ల‌కు, ఉద్యోగుల‌కు నిరాశే
– తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్
ద‌ర్శిని డెస్క్ : కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ పసలేని నిష్ప్రయోజనకరంగా ఉంద‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. మంగ‌ళ‌వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా రామ‌న్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు బ‌డ్జెట్ తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని అన్నారు. బడ్జెట్ దశ దిశా నిర్దేశం లేని, పనికి మాలిన, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండి, మాటల గారడీతో కూడి వున్నదని అని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా, నిస్పృహలకు గురిచేస్తూ, మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్ ను సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని సీఎం అన్నారు. దేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ ను బిగ్ జీరో అని సీఎం స్పష్టం చేశారు. దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులను, చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఇన్ కం టాక్స్ లో స్లాబ్స్ ను ఏమీ మార్చకపోవడం విచారకరమని సీఎం అన్నారు. ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు చకోర పక్షుల్లా ఎదురుచూసారని, వారి ఆశల మీద కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లిందన్నారు. వైద్యం తదితర ప్రజా ఆరోగ్యం, మౌలిక రంగాలను అభివృద్ధి పరచడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేట తెల్లమైందన్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్టకాలంలో హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి పరుస్తుంటే ఆ దిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమని” సీఎం అన్నారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం మౌలికవసతుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టలేదన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.