అల.. జల తాండవంలో..!
– తడిసి మునిగిన తాండూరు మండలం
– తెలంగాణ – కర్ణాటకకు స్థంభించిన రవాణా
– మల్కాపూర్‌లో నట్టింట్లోకి వాగు వరధ
– ఉప్పొంగిన బెల్కటూర్ వాగు, గ్రామస్తుల ఇక్కట్లు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని వాగులు, నదులకు భారీగా వరధ రావడంతో మండలంలోని పలు గ్రామాలు జల తాండవంలో చిక్కుకుపోయాయి. గ్రామాల మద్య రాకపోకలు స్థంభించడంతో తెలంగాణ రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మద్య రవాణా వ్యవస్థ స్థంభించింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం గురువారం కొట్టినట్లు కనిపించింది. మండలం సరిహద్దు కొత్లాపూర్ సమీపంలోని ముళ్లవాగు ఉదృతంగా ప్రవహించడంతో కర్ణాటకలోని మిర్యాణ్, కల్లూరు, చించొల్లి వైపు అటు.. ఇటు రాకపోకలు నిలిచిపోయాయి. బెల్కటూర్ వద్ద వాగు ప్రవహించడంతో సత్రసాల, కర్చికాలం, నిడుగుంద గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.

అదేవిధంగా తాండూరు మండలంలోని ఐనెల్లి వద్ద బండల వాగు, అల్లాపూర్, పర్వతాపూర్, బెల్కటూర్ గ్రామాల్లో వాగులకు ఉదృతి పెరగడంతో ఆయా గ్రామాల మధ్య అంతరాయం ఏర్పడింది. ఇక బెల్కటూర్ వాగు ప్రవహించడం వల్ల కరణ్ కోట్, ఓగిపూర్, చిట్టిగణాపూర్, చంద్రవంచ గ్రామాల మద్య రాకపోకలు ఆగిపోయాయి. మరోవైపు మల్కాపూర్ గ్రామంలో భవాని నగర్ నీటమునిగింది. వాగులోని వరధ నీరు నట్టింట్లోకి చేరాయి. ఈ క్రమంలో గ్రామానికి చెందిన షాదీపురం కమలమ్మ, శేఖర్ గౌడ్, ఇతరుల ఇండ్లలో నిత్యవసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. వెంటనే గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీ పండరి, మాజీ ఉపసర్పంచ్ హసన్ పటేల్‌లు కాలనీలో పర్యటించారు. వర్షంతో జనం పడుతున్న ఇబ్బందులను తహసీల్దార్, అధికారులకు సమాచారం అందించారు.

మరోవైపు బెల్కటూర్ గ్రామంలో వాగు కష్టాలపై యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు బోయ అశోక్ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలపై విమర్శలు చేశారు. బ్రిడ్జి నిర్మించి కష్టాలను తీర్చాలని ఎనిమిదేళ్లుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా బెల్కటూర్ వాగుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు.



