ప్రశాంతంగా ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష
– పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ
– జిల్లాలో 11 కేంద్రాలకు 3778 మంది అలార్ట్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్సై పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలు వికారాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమయ్యింది. అభ్యర్థులను 9 గంటల నుంచే పరీక్షా హాలులోకి అనుమతించారు. హాల్‌టికెట్లు, ఐడీ కార్డుల పరిశీలించి తనిఖీలు నిర్వహించిన అనంతరం లోపలికి పంపించారు. ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని వికారాబాద్, మన్నెగూడలో ఏసీఆర్ బృంగీ జూనియర్ కళాశాల, సిద్దార్థ జూనియర్ కళాశాల, గౌతమి జూనియర్ కళాశాల, వికాస్ జూనియర్ కళాశాల, విశ్వభారతి డిగ్రీ కాలేజి, సరస్వతి జూనియర్ కళాశాల, తక్షశిల డిగ్రీ కాలేజీ, శ్రీ అనంత పద్మనాభ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కాలేజీ, శ్రీచైతన్య టెక్నో స్కూల్, శ్రీసాయి కాలేజీ ఆఫ్ డెంటల్ సర్జరీ, టీఎస్ మోడల్ స్కూల్‌లను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆయా కేంద్రాలలో 3778 మంది అభ్యర్థులను పరీక్షలకు అలార్ట్ చేశారు. మరోవైపు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరీక్షల సందర్భంగా అభ్యర్థులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం రవాణా సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. అభ్యర్థుల నుంచి అన్ని వివరాలను పరిశీలించిన తరువాత పరీక్షలకు అనుమతించడం జరిగిందన్నారు.



