పార్ల‌మెంట్‌ను ముట్ట‌డిస్తాం

తాండూరు రాజకీయం వికారాబాద్

పార్ల‌మెంట్‌ను ముట్ట‌డిస్తాం
– బీసీ సంక్షేమ సంఘం క‌న్విన‌ర్ రాజ్ కుమార్
– చ‌లో ఢిల్లీ ద‌ర్నాకు బ‌య‌ల్దేరిన నేత‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: బీసీల డిమాండ్ల సాధ‌న కోసం ఢిల్లీలోని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షులు ఆర్.కృష్ణ‌య్య నాయ‌క‌త్వంలో పార్ల‌మెంట్‌ను ముట్ట‌డిస్తామ‌ని సంఘం తాండూరు నియోజ‌క‌వ‌ర్గ క‌న్విన‌ర్ కందుకూరి రాజ్ కుమార్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణ‌య్య‌ ముఖ్య అతిథిగా జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వహాక అధ్యక్షులు లాల్ కృష్ణ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సాకు చెందిన ముఖ్య బిసి నాయకులు పాల్గొన్నారు. వారితో పాటు తాండూరు నియోజ‌క‌వ‌ర్గ క‌న్విన‌ర్ రాజ్ కుమార్ కూడ హాజ‌ర‌య్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీ సీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు అందించాలని, జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 9న చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. చలో ఢిల్లీ ద్వారా ఢిల్లీలో పార్లమెంటును, మంత్రుల ఇండ్ల‌ను ముట్టడించి, ప్రతిపక్షాలను కలిసి ప్రభుత్వం పై వత్తిడి పెంచడం లాంటి కార్యక్రమాలు చేపడుతామ‌ని పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో ఉన్న కుల గణన కేసులో పురోగతిని సాధించుకునేలా ఉద్యమిస్తామన్నారు. అనంతరం రాజ్ కుమార్‌తో పాటు నాయకులు అనంతయ్య, వేముల రామకృష్ణ, ఉదయ్, చంటి, తరుణ్ యాదవ్ తదితరులు ఢిల్లీకి బయల్దేరారు.