కేసీఆర్ పర్యటనకు పక్కా ఏర్పాట్లు
– కొత్త మెడికల్ కాలేజీ శంకుస్థాపనకు చాన్స్
– జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం
– వికారాబాద్‌లో 25 వేల మందితో భారీ సభ
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ జిల్లా పర్యటన ఖరారు కావడంతో అన్ని ఏర్పాట్లను సిద్దం చేస్తున్నారు. ఈనెల 14న అంటే స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందు సీఎం కేసీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా మంత్రి సబితారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌లు పక్కా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే వికారాబాద్ జిల్లా కలెక్టర్ 14న ఉన్న సెలవు దినాన్ని రద్దుచేశారు. అధికార యంత్రాంగం విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఎంతో కాలంగా నేతలు, ప్రజలు కేసీఆర్ పర్యటన కోసం ఎదురు చూస్తున్న తరుణంలో తేది ఖరారు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 14న జరిగే సీఎం కేసీఆర్ పర్యటనలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవం చేయనున్నారు. దీంతో పాటు జిల్లాకు కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో 25 వేల మందితో భారీ సభను ఏర్పాటు చేసేందుకు నేతలు నిశ్చయించారు. కేసీఆర్ పర్యటనను దిగ్విజయం చేసేందుకు అధికారులు, నేతలు నిమగ్నమయ్యారు.



