52 మార్కులు చాలు
– ఎస్సై ప్రిలిమ్స్‌లో తర్వాతి దశకు అర్హత
– ఎనిమిది తప్పుడు ప్రశ్నలకు సమాన మార్కుల జమ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఎస్సై ప్రాథమిక పరీక్షలో అభ్యర్థులు అర్హతల సాధించేందుకు 52 మార్కులు పొందితే చాలని బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 7 నిర్వహించిన ప్రిలిమినరీ ప్రాథమిక రాత పరీక్షకు సంబంధించి ‘కీ’ని టీఎస్‌ఎల్పీఆర్బీ శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 60 (30శాతం) వస్తే వారిని తర్వాతి దశకు అర్హులుగా నిర్ణయించారు. ప్రిలిమినరీ కీ ఆధారంగా తప్పులుగా వచ్చిన మొత్తం 8 ప్రశ్నలను తొలగించినట్టు బోర్డు తెలిపింది. ఆ ఎనిమిది ప్రశ్నలకు 8 మార్కులను అభ్యర్థులకు కలపనున్నట్టు బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తం 8 ప్రశ్నలు తప్పుగా ఉన్నందున ప్రాథమిక పరీక్షలో 52 మార్కులు సాధించిన అభ్యర్థులను సైతం తర్వాతి దశకు అర్హులుగా గుర్తించనున్నట్టు ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ లెక్కన 60 మార్కులకు బదులు, 52 మార్కులు సాధించిన వారు సైతం తర్వాతి దశకు అర్హత సాధించినట్టే అని అర్థం. www.tslprb.inలో ప్రిలిమనరీ కీ అందుబాటులో ఉన్నందున అభ్యర్థులు వారి బుక్‌లెట్ కోడ్ ఆధారంగా సరిచూసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా పరీక్ష నిర్వహణలో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియంలో ప్రశ్నపత్రాలు రూపొందిస్తారని, ఒక భాష నుంచి ప్రశ్నలు మరో భాషలోకి తర్జుమా చేసేటప్పుడు, కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలకు రెండు, మూడు (ఏ,బీ,సీ,డీ ఆప్షన్లలో) సమాధాలు సరైనవిగా ఉండటం, కొన్నిసార్లు 4 ఆప్షన్లలో కూడా సమాధానం లేకపోవడం వంటి కారణాలతోనే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నట్టు వివరించారు.



