బీజేపోళ్ల‌ను న‌మ్ముకుంటే శఠ‌కోప‌మే..!

తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

బీజేపోళ్ల‌ను న‌మ్ముకుంటే శఠ‌కోప‌మే..!
– ఏం త‌ప్పు చేశాన‌ని నాబ‌స్సును అడ్డుకుంటారు
– క‌మ‌ల‌నాథుల‌పై కేసీఆర్ ఫైర్
వికారాబాద్‌, ద‌ర్శినిప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వాళ్ల‌ను న‌మ్ముకుంటే శ‌ఠ‌కోపం త‌ప్ప‌ద‌ని రాష్ట్ర‌ ముఖ్యమంత్రి కేసీఆర్ విమ‌ర్శించారు. మంగ‌ళ‌వారం వికారాబాద్ పర్యటన‌లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ బ‌స్సును కొంద‌రు బీజేపీ నాయ‌కులు అడ్డుకున్నారు. అనంత‌రం స‌మావేశంలో సీఎం కేసీఆర్ బీజేపీ నాయ‌కుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్‌ను జిల్లా చేశామని అన్నారు. తెలంగాణ ఏర్పడకుంటే వికారాబాద్‌ జిల్లా అయ్యేదా..? తమ ప్రభుత్వం వచ్చాకా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని అన్నారు. వికారాబాద్‌కు మెడికల్‌, డిగ్రీ కాలేజీలు వచ్చాయని, గత పాలకులకు, ప్రస్తుతం పాలకులకు తేడాను ప్రజలు గమనించాలని ప్రజలను కోరారు. సమైక్య పాలనలో దారుణమైన పాలన చూశామని, రాష్ట్రం వస్తే భూముల ధరలు తగ్గిపోతాయని తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందిస్తుంటే.. కేంద్రం మాత్రం ఎనిమిదేళ్ల కాలంలో చేసిందేమి లేదని మండిపడ్డారు. ఇతర పార్టీల జెండాలు పట్టుకుని మోసపోవద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలని సరైన జెండా పట్టుకుని ముందుకెళ్లాలని, తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వికారాబాద్‌లో నేనేం తప్పు చేశాను.. బీజేపీ కార్యకర్తలు నా బస్‌కు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు.