కాలేజీలను కానుకగా ఇవ్వండి

కెరీర్ తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

కాలేజీలను కానుకగా ఇవ్వండి
– జిల్లాకు బీఈడీ, ఐటీఐలను కేటాయించండి
– సీఎం కేసీఆర్‌ను కోరిన సునీత‌మ్మ‌
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : విద్యారంగంలో వెనుక‌బ‌డిన వికారాబాద్ జిల్లాకు బీఈడీ, ఐటీఐ కాలేజీలను విద్యార్థుల‌కు కానుక‌గా ఇవ్వాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్నం సునీతా మ‌హేంద‌ర్ రెడ్డి కోరారు. మంగళవారం వికారాబాద్ వచ్చిన సీఎంకు బహిరంగ సభావేధికపై వినతిపత్రం అందించారు. 2018లో తాండూరుకు మెడికల్ కళాశాల ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని, హామీ మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినందున సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నూత‌న జిల్లాగా వికారాబాద్‌ను ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా.. ఎంతో అభివృద్ధికి స‌హ‌క‌రించార‌ని గుర్తుచేశారు. అయితే తాండూరు నియోజకవర్గంలో భారీ సిమెంట్ కర్మాగారాలు ఉన్నందున నిరుద్యోగ యువతకు ఐటీఐ కళాశాల ఉంటే ఉపయోగ పడుతుందని అన్నారు. బీఈడీ చ‌దువుకునే విద్యార్థులకు కాలేజీని ఏర్పాటు చేస్తే దూర ప్రాంతాల‌కు వెళ్లే వ్య‌య ప్ర‌యాస‌లు తొల‌గిపోతాయ‌న్నారు. దీంతో పాటు జిల్లా పరిషత్ నూతన కార్యాలయానికి రూ.7.50 కోట్లు మంజూరు చేయాలని విన‌తిప‌త్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు సునీతారెడ్డి తెలిపారు.