శాంతియుతాన్ని పాటిద్దాం
– ఈద్గా ఘటనలో వివాదం తగదు
– నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెహరాజ్
– సంఘటనపై విచారణ చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని ఈద్గా మైదానంలో జరిగిన అగ్రి ప్రమాద ఘటనలో అందరు శాంతియుతాన్ని పాటించాలని ఎంఐఎం హైదరాబాద్ నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ జాఫర్ మెహరాజ్ హుస్సేన్ పిలుపునిచ్చారు. తాండూరు పట్టణం చెన్‌గెష్ పూర్ రోడ్డుమార్గంలోని ఈద్గా మైదానంలో ఉన్న ఓ గదిలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గదిలో ఉన్న ఈద్గాకు సంబంధించిన వస్తువులు, సామాగ్రి దగ్ధమైపోయాయి. శనివారం ఈ విషయం తెలుసుకున్న ఎంఐఎం పార్టీ హైదరాబాద్ నాంపల్లి ఎమ్మెల్యే మెహరాజ్ హుస్సెన్ ఆ పార్టీ ఎంపీ, జాతీయ నాయకులు అసదోద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు తాండూరును సందర్శించారు.

స్థానిక పార్టీ నేతలు, ముస్లిం పెద్దలతో కలిసి ఈద్గా మైదానానికి చేరుకుని ప్రమాదం జరిగిన గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈద్గా మైదానంలోని గదిలో అగ్ని ప్రమాదం జరగడం దారుణమన్నారు. జరిగిన అగ్ని ప్రమాదంపై వెంటనే పూర్తి విచారణ చేపట్టాలని పోలీసు, రెవెన్యూ అధికారులను విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వర్ఫ్ బోర్డు నుంచి పరిహారం అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సంఘటనపై వివాదాలకు తావివ్వొద్దని, అందరు శాంతియుతంగా ఉండి సమన్వయం పాటించాలన్నారు. అంతకుముందే వక్ఫ్ బోర్డు అధికారితో కలిసి ప్రమాదంలో జరిగిన నష్టంపై సమీక్ష జరిపారు. అక్కడి నుంచే వక్ఫ్ బోర్డు చైర్మన్‌తో మాట్లాడి.. పరిహారంపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే జాఫర్ మెహరాజ్ హుస్సేన్ తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్‌తో భేటీ అయ్యారు. ఈద్గాలో జరిగిన సంఘటనపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటి అధ్యక్షులు యూసుఫ్ ఖాన్, ఎంఐఎం పట్టణ అధ్యక్షులు హాది, ముస్లింవెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాబర్, ఉపాధ్యక్షులు అలీం(షల్లో), ఖుర్షిద్ హుస్సేన్, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ సాజిద్ అలీ, ఎంఐఎం ప్రధాన కార్యదర్శి బీఆర్ యూనుస్, జాయింట్ సెక్రటరి నబిసాబేర్, నాయకులు అన్వర్ ఖాన్, రవూఫ్ ఖాన్, ఉమర్ ఖాన్, మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.


