హైకోర్టు ఆదేశాల‌తో అద్దెదారుల‌కు ఊర‌ట‌

రాజకీయం వికారాబాద్

హైకోర్టు ఆదేశాల‌తో అద్దెదారుల‌కు ఊర‌ట‌
– తెరుచుకున్న హ‌నుమాన్ చౌల్ట్రీ దుకాణాలు
– ద‌గ్గ‌రుండి తెరింపించిన అధికారులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డు మార్గంలోని హనుమాన్ చౌల్ట్రీలోని అద్దెదారుల‌కు ఊర‌ట ల‌భించింది. హైకోర్టు ఆదేశాల‌తో సముదాయంలోని దుకాణాలు మళ్లీ తెరుచుకున్నాయి. గతనెల 18న దె వాదాయ శాఖ అధికారుల బృందం తనిఖీలు చేసి హనుమాన్ చౌల్ట్రీలోని 12 దుకాణాలు, పైభాగంలోని దుకాణాలను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఒకేసారి 15 మంది, అధికారుల బృందం తనిఖీలు చేసి దుకాణాలను సీజ్ చేయడం తాండూరులో చర్చనీయాంశమైంది. దీనిపై సముదాయంలో అద్దెకు ఉంటున్న 1, 3, 6, 8, 9, 11 దుకాణదారులు, పైభాగంలో గదులకు సంబంధించిన వారు హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. చట్ట విరుద్ధంగా దుకాణాలను సీజ్ చేశారని కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. వారి తరుపున న్యాయవాది వాదనలు వినిపించడంతో స్పందించిన హైకోర్టు వెంటనే వారి దుకాణాలను తెరిపించాలని, బకాయిలు ఉంటే చర్చించుకోవాలని అధికారులను ఆదేశించింది. బకాయిలపై నోటీసులు అందించి వసూలుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు గురువారం స్టేషన్ హనుమాన్ దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్ హనుమాన్ చౌల్ట్రీలో సీజ్ చేసిన దుకాణాలను తెరిపించారు.

అదేవిధంగా అద్దె దారులకు బకాయిలు చెల్లించాలని నోటీసులు అందజేశారు. మరోవైపు అద్దెదారుల తరుపున టీఆర్ఎస్ యువనాయకులు బిర్కడ్ రఘు స్పందిస్తూ కొందరు వ్యక్తులు అధికారులను తప్పుదోవ పట్టించి దుకాణాలను సీజ్ చేయించారని ఆరోపించారు. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని, చివరకు అద్దెదారులకు న్యాయం జరిగిందన్నారు. అంతేకాకుండా హనుమాన్ చౌల్ట్రీ విషయంలో తన తండ్రి భరత్ భూషన్ పై చేసిన ఆరోపణలు అవాస్తమని, 30 ఏండ్లుగా రాజకీయాలలో ఉన్న ఆయనను ఎదుర్కో లేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.