వైభవంగా సమైక్యత వ‌జ్రోత్స‌వాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా సమైక్యత వ‌జ్రోత్స‌వాలు
– మువ్వన్నెల జెండాలతో భారీ ర్యాలీ
– పాల్గొన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు వైభవంగా ప్రారంభయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు రోజుల కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం తాండూరు నియోజకవర్గ స్థాయిలో 15వేల మందితో జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ర్యాలీ ప్రారంభయ్యింది. ర్యాలీలో విద్యార్థులతో పాటు నామినేటేడ్ చైర్మన్లు, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కళాశాల మైదానం నుంచి పురవీధుల్లో జాతీయ జెండాలతో సాగిన ర్యాలీ త్రివర్ణ శోభితాన్ని తలపించింది. ఇందిరా చౌరస్తా మీదుగా ర్యాలీ పట్టణంలోని విలియమూన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంది. సభ ప్రాంగణంతో నేతలు, అధికారులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధుల రాకతో మైదానం కిక్కిరిసి పోయింది. వజ్రోత్సవాలలో మొదటి రోజు అట్టహాసంగా కొనసాగింది. ఈ కార్యక్రమం విజయవంతానికి తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్, నోడల్ ఆఫీసర్ కోటాజీ, డీఎస్పీ శేఖర్ గౌడ్‌తో పాటు ఆయా శాఖల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా అందరు జాతీయ జెండాకు వందనం సమర్పించారు. తెలంగాణ విలీనానికి అనుకూలంగా నినాదాలు చేశారు.