ఆయూష్మాన్ కార్డుతో ఉచిత వైద్యం

ఆరోగ్యం జాతీయం తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

ఆయూష్మాన్ కార్డుతో ఉచిత వైద్యం
– రూ. 5లక్షల వరకు వైద్య సేవలు
– గ్రామాల్లో, పట్టణాల్లో అర్హులెవరంటే
దర్శిని డెస్క్: అర్హులైన పేదలందరికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అందులో ఆయుష్మాన్ భారత్ యోజన పథకం ప్రతిష్టాత్మకం. ఈ పథకం కింద దేశంలోని పేద వర్గాలకు ప్రభుత్వం ఉచిత చికిత్సను అందిస్తుంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి ఆయుష్మాన్ కార్డును జారీ చేస్తుంది. ఈ ఆయుష్మాన్ పథకం కింద అర్హులైన వ్యక్తులకు ఆయుష్మాన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. కార్డు పొందిన లబ్దిదారుడు అత్యవసర పరిస్థితుల్లో రూ. 5 లక్షల వరకు ఏ ఆసుపత్రులలో అయినా ఉచితంగా చికిత్స పొందవచ్చు. దీని కోసం మీరు ఈ కార్డు పొందేందుకు అర్హులా ? కదా అనే విషయాన్ని తెలుసుకోవాలి.

అర్హులు ఎవరు?
10 కోట్ల కుటుంబాలకు పీఎంజేఏవై వర్తిస్తుంది. వీరిలో ఎనిమిది కోట్ల గ్రామీణ కుటుంబాలు, 2.33 కోట్ల పట్టణ ప్రాంత కుటుంబాలు ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేనివారు, కేవల వేతనం మాత్రమే తీసుకునేవారు, ఇతరత్రా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు దీనికి అర్హులు.
పట్టణ ప్రాంతాల్లో చేసే వృత్తుల ఆధారంగా లబ్దిదారులను నిర్ణయిస్తారు. ఈ పథకం కింద కేంద్రం ఒక కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షలు అందజేస్తుంది.

గ్రామీణ ప్రాంతాల్లో..
గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, 16 నుంచి 59 ఏళ్ల వయసున్న మగవాళ్లు లేని కుటుంబాలకు, బిచ్చగాళ్లకు, వికలాంగులు ఉన్న కుటుంబాలు, ఏ పనీ చేయలేని వృద్ధులున్న కుటుంబాలకు, ఇల్లు లేని, రోజు కూలీకి వెళ్లేవారు, ఆదివాసీ సమాజాలు, చట్టబద్ధంగా స్వేచ్ఛ పొందిన కట్టుబానిసలు, సరైన ఇల్లు లేనివారు, లేక ఒక్క గదిలో జీవిస్తున్న కుటుంబాలు, పారిశుద్ధ్య పనుల్లో ఉన్న కుటుంబాలు ఈ పథకం ప్రయోజనాలు పొందగలరు.

పట్టణ ప్రాంతాల్లో-
పట్టణ ప్రాంతాల్లో బట్టలు ఉతికేవాళ్లు/చౌకీదార్లు, చినిగిన బట్టలు ఏరుకునేవారు, మెకానిక్‌లు, ఎలక్ట్రీషియన్లు, రిపెయిర్ వర్కర్లు, ఇళ్లలో పనిచేసేవారు, పారిశుద్ధ్య కార్మికులు, తోటమాలీలు, వీధులు ఊడ్చేవాళ్లు, చేతి వృత్తులు చేసుకునేవాళ్లు, హస్తకళల కార్మికులు, కుట్టుపనివాళ్లు, చెప్పులు కుట్టేవాళ్లు, తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునేవారు, ప్లంబర్లు, మేస్త్రీలు, భవన నిర్మాణ కూలీలు, పోర్టర్లు, వెల్డర్లు, పెయింటర్లు, సెక్యూరిటీ గార్డులు, వాహనాలు నడిపే డ్రైవర్లు, కండక్టర్లు, హెల్పర్లు, రిక్షా తొక్కేవారు, చిన్న సంస్థల్లో సహాయకులుగా పనిచేసేవారు, డెలివరీ బాయ్స్, షాప్ కీపర్లు, వెయిటర్లు, అందరూ ఈ పథకం నుంచి లబ్ది పొందవచ్చు.

అర్హతలను తెలుసుకోండి
– మీరు ఆయుష్మాన్ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా అధికారిక పోర్టల్ కి వెళ్లాలి.
– తర్వాత ఇక్కడ మీరు ‘యామ్ ఐ ఎలిజిబుల్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి.
– ఇప్పుడు మీరు ఇక్కడ రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. మీరు మొదట మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, రెండవదానిలో మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి.
– అప్పుడు మీకు అర్హత ఉందా లేదా? అనేది తెలిసిపోతుంది. అర్హత ఉంటే కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
– దీని తర్వాత మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను కూడా సమర్పించాలి.
– మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఇస్తారు.
– ఆ తర్వాత మీరు 15 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది.
– 15 రోజుల తర్వాత మీ ఇంటి చిరునామాకు ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ వస్తుంది.
– ఆ తర్వాత మీరు ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఏ ఆసుపత్రిలోనైనా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను పొందవచ్చు.