చోరీల నవాబ్..!

క్రైం తాండూరు తెలంగాణ వికారాబాద్

చోరీల నవాబ్..!
– చిన్నప్పటి నుంచి దొంగతనాలే
– జైలుకెళ్లినా మారని బుద్ది
– ఇరానీ గ్యాంగ్‌ పేరుతో చోరీలు
– తాండూరులో పట్టుకున్న పోలీసులు
– వివరాలను వెల్లడించిన తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : అతని పేరు మజులుం అలియాస్ నవాబ్. వృత్తి కళ్ల అద్దాల వ్యాపారం అయినా పవృత్తి మాత్రం చోరిలే. ఈ హస్తకళ చిన్నప్పటి నుంచి అబ్బింది. పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినా బుద్ది మాత్రం మారలేదు. బయటకు వచ్చిన తరువాత వరుసగా పది దొంగతనాలు చేశాడు. తాండూరులో కూడ మూడో సారి దొంగతనానికి వచ్చి పోలీసులకు చిక్కాడు. కర్ణాటక రాష్ట్రం బీదర్ ఇరానీ గ్యాంగుకు చెందిన ఈ నవాబ్‌ను అతనికి సహకరించిన సొంత బావ మరిదిని కటకటాల్లోకి పంపారు. మంగళవారం తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ డీఎస్పీ కార్యాలయంలో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు.

కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా చిద్రి రోడ్ హుస్సెన్ కాలనీ ఇరానీ గల్లికి చెందిన నవాబ్ అలియాస్ మజులుం(39), అతని బావమరది మహమ్మద్ అలీలు స్థానికంగా కళ్ల అద్దాల వ్యాపారం చేసేవాడు. నవాబ్ చిన్నప్పటి నుంచి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తన అనుచరులతో కలిసి దారి దోపిడీలు చేయడమే కాకుండా ఇంటలిజెన్స్, ప్రత్యేక పోలీసు వాళ్లమని మభ్య పెట్టి.. వినకపోతే భయ పెట్టి డబ్బులు, బంగారం దోచుకుని దొంగతనాలు చేసేవాడు. దీంతో పాటు పెద్ద పెద్ద పట్టణాలలో రద్దీగా ఉండే బ్యాంకులను లక్ష్యంగా ఎంచుకుని అక్కడ నిరక్ష రాస్యులైన వారిని, వృద్ధులను ఎంపిక చేసుకుని వారి వద్దకు వెళ్లి మాయమాటలు చెప్పే వాళ్లు, బ్యాంకు అధికారులు దొంగనోట్లు ఇచ్చారని, లేదా డ్రా చేసిన డబ్బులను లెక్కిస్తానని చెప్పి అందులో కొంత డబ్బును తెలివిగా నొక్కేసి జారుకునేవాడు. పనైపోయిన తరువాత అప్పటికే బైకుతో సిద్ధంగా ఉన్న అనుచరులతో కలిసి పరారయ్యేవాడు.

పలు ప్రాంతాల్లో చోరీలు
కర్ణాటకకు చెందిన నవాబ్‌కు చోరీలలో ప్రత్యేక ట్రాక్ ఉంది. తన అనుచరులు ఇక్బాల్, మహెందీ హసన్, మహమ్మద్‌ అలీలతో కలిసి తెలంగాణలోని సదాశివపేట్, కామారెడ్డి, వట్‌పల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడ్డారు. చివరిసారి వట్‌పల్లిలో నమోదైన కేసులో జైలుకు వెళ్లాడు. 2019లో విడుదల అయ్యాడు. అయినా కూడ పద్ధతి మార్చుకోకుండా వివిధ ప్రాంతాలలో చోరీలకు పాల్పడ్డాడు. తరువాత సంగారెడ్డిలో 2, ఆర్సీ పురంలో 2, సదాశివపేట్‌లో 1, మియాపూర్‌లో 1, తాండూరులో 2, బీదర్‌లో 1 కేసు నమోదై ఉన్నాయని తాండూరు డీఎస్సీ శేఖర్ గౌడ్ తెలిపారు. తాండూరులో మూడో సారి ప్రయత్నించే సమయంలో పోలీసులకు చిక్కాడు.

ఎలా చిక్కాడంటే
చోరీలకు మరిగిన నవాబ్ ఈనెల 3వ తేదిన తాండూరు పట్టణం షావుకార్ పేట్‌లోని స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా బ్యాంకులో చోరీకి పాల్పడ్డాడు. బ్యాంకులో సాయిపూర్‌కు చెందిన గిరిబాబు అనే వ్యక్తి డబ్బులు డ్రా చేయగా దొంగనోట్లు వచ్చాయని, లెక్కిస్తానని చెప్పి రూ. 7,500లు లాక్కుని పరారయ్యాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంకులపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో తాండూరు పట్టణం శాంత్ మహాల్‌ చౌరస్తా సమీపంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏడీబీ శాఖ బ్యాంకులో మరోసారి చోరీ చేసేందుకు వచ్చాడు. అతని బావమరిదిని బ్యాంకు బయటే బైకుతో సిద్దంగా ఉంచి లోనికి వెళ్లాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీస్టేషన్ కానిస్టేబుళ్లు శివ, నర్సింలు బ్యాంకు వద్దకు వచ్చారు. ముందుగా బైకుతో ఉన్న బావమరిధిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బ్యాంకులో ఉన్న నవాబ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చేతిని పట్టుకున్నకానిస్టేబుల్‌ నర్సింహా చేతికి కొరికి పారిపోయేందుకు యత్నించాడు. అప్పటికే మరో కానిస్టేబుల్ శివ జేబులో నుంచి కత్తిని తీస్తున్న నవాబ్ చేతులను గట్టిగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.


ఇద్దరి రిమాండ్

ఇరానీ గ్యాంగుకు చెందిన నవాబ్, అతని బావ మరిది మహమ్మద్ అలీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండుకు తరలించడం జరిగిందని డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. అయితే బ్యాంకులో నవాబ్‌ను పట్టుకునే క్రమంలో ఇద్దరు తాండూరు పౌరులు సాహసోపేతంగా సహకారం అందించారని, వారిని అభినందించారు. చాకచాక్యంగా నిందితున్ని పట్టుకున్న కానిస్టేబుల్ శివ, నర్సింహాలను డీఎస్పీ అభినందించారు. అదేవిధంగా నిందితుని వద్ద నుంచి ఓ కత్తి, పాత కేసులో దొంగిలించిన బైకును స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

అపరిచితులతో జాగ్రత్త: డీఎస్సీ శేఖర్ గౌడ్‌
బ్యాంకులలో, రద్దీ ప్రాంతాలలో ప్రజలు ఆపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ శేఖర్ గౌడ్ సూచించారు. ముఖ్యంగా బ్యాంకులకు వెళ్లాల్సి వస్తే కుటుంబ సభ్యులను, లేదా తెలిసిన వారిని వెంట తీసుకెళ్లాలని సూచించారు. అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది అంజద్, షబ్బీల్‌ తదితరులు ఉన్నారు.