అడ్డంగా దొరికిన గంజాయి విక్ర‌యేత‌లు

క్రైం తాండూరు వికారాబాద్

గంజాయి సొమ్ముపై అత్యాశ‌
– విక్ర‌యాల‌కు య‌త్నించిన‌ న‌లుగురు నిందితులు
– అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించిన పోలీసులు
– వివ‌రాలు వెల్ల‌డించిన ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్‌రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : గంజాయిని అమ్మి ఎక్కువ డ‌బ్బులు సంపాదించాల‌ని అత్యాశ ప‌డ్డారు న‌లుగురు వ్య‌క్తులు. రైల్వేస్టేష‌న్‌, ఏరియా ప్రాంతాల్లో విక్ర‌యించాల‌ని య‌త్నించి పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయారు. తాండూరు పోలీసులు నిందితుల‌పై కేసు న‌మోదు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. గురువారం తాండూరు ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డి తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం సేడం తాలూకా చందాపూర్ గ్రామానికి చెందిన బబంగర్ అశోక్, సిద్దిరాం చవాన్, తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరమ్మ కాలనీకి చెందిన బింగి శ్రీకాంత్, మంగలి శరత్ కుమార్లు తాండూరు రైల్వే స్టేషన్‌, పాత తాండూరులో గంజాయి అమ్మి ఎక్కువ సంపాదించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అనుకున్న దాని ప్ర‌కారం బుధ‌వారం తాండూరు రైల్వేస్టేష‌న్‌లో అనుమానాస్పదంగా తిరిగారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకుని విచారించగా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 1140 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు గురువారం వారిపై కేసు నమోదు చేసి.. కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించినట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీఐ రాజేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ ప‌ట్ట‌ణంలో ఎవ‌రైనా గంజాయి విక్ర‌యాల‌కు పాల్ప‌డితే పోలీసుల‌కు స‌మాచారం అందించాల‌ని కోరారు. మాద‌క ద్ర‌వ్యాల‌ను విక్ర‌యిస్తే ఎంత‌టి వారినైనా ఉపేక్షించేది లేద‌ని, త‌ప్ప‌నిస‌రిగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. ఈ స‌మావేశంలో ప‌ట్ట‌ణ ఎస్ఐ అర‌వింద్ కుమార్, సిబ్బంది ఉన్నారు.