పైలెట్ సెల్యూట్..!
– ప్రలోభాల భగ్నంలో కీలకం
– రోహిత్ రెడ్డిని అభినందించిన సీఎం
– హర్షం వ్యక్తం చేస్తోన్న పార్టీ శ్రేణులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాజకీయాలలో పెను సంచలనం సృష్టించాలనే భారీ కుట్ర. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలనే లక్ష్యంగా చేసుకుని ప్రలోభాల కుతంత్రాలను భగ్నం చేయడంలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైలెట్ అయ్యారు. పిరాయింపులకు ఎర వేసిన నాయకుల గుట్టును రట్టు చేసి స్వయంగా సీఎం కేసీఆర్ ద్వారా అభినందనలు అందుకున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన చర్యలకు పార్టీ శ్రేణులు సెల్యూట్ చేస్తున్నారు. హైదారాబాద్ శివారు మొయినాబాద్‌లోని ఓ ఫాం హౌస్ వేదికగా జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అరెస్టు అయిన రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లు ముందుగా రోహిత్‌రెడ్డితో మంతనాలు సాగించినట్లు ప్రచారం జరిగిందని ప్రధాన ప్రతిక ప్రచురించింది. అయితే నిందితుల్లో ఒకరైన నందకుమార్.. రోహిత్‌రెడ్డి స్నేహితుడికి బంధువు అని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వ్యాపార సంబంధాలున్నట్లు సమాచారం. ఆ తరువాత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డిలు ఫాంహౌస్‌లో భేటీ కావడం జరిగింది. ముందే ప్లాన్ ప్రకారం మంతనాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందించడంతో నిమిషాల్లోనే వ్యవహారం అంతా సంచలనమైంది. పిరాయింపులను భగ్నం చేయడంలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కీలకంగా మారారు. రాత్రికి రాత్రే సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటిలో పాల్గొన్న పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ అభినందించారు. పిరాయింపుల కుట్రను భగ్నం చేయడంలో రోహిత్ రెడ్డి కీలకంగా వ్యవహరించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పైలెట్ హీరో.. అంటూ.. మగాడ్రా బుజ్జీ అంటూ వైరల్ చేశారు.

