పుస్తక పఠనంతోనే విజ్ఞానం
– గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా విద్యాధికారి రేణుకా దేవి
– ఆకట్టుకున్న పుస్తక ప్రదర్శన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెంపొందుతుందని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి అన్నారు. 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి రేణుకాదేవి ముఖ్య అతిథిగా హాజరై గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్తో కలిసి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీఈఓ రేణుకా దేవి మాట్లాడుతూ పుస్తక పఠనం వల్ల మంచి సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు. గ్రంథాలయాలు విజ్ఞానానికి కేంద్రాలుగా నిలుస్తాయన్నారు. విద్యార్థులు, యువకులు, అభ్యర్థులకు అందులోకి పుస్తకాలు మేలైన విజ్ఞానాన్ని అందిస్తాయన్నారు. గ్రంథాలయాల పుస్తకాలను అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ పుస్తకాలే విద్యార్థులకు, అభ్యర్థులకు, వృద్ధులకు మంచి స్నేహితులని అన్నారు. పుస్తకాలతో కలిగే ప్రయోజనాలను తెలియజేసేందుకే గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్దపడే అభ్యర్థులకు గ్రంథాలయాలలో పుస్తకాలను అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరోవైపు గ్రంథాలయ కేంద్రంలో నిర్వహించిన పుస్తక ప్రదర్శన విద్యార్థులతో పాటు ఔత్సాహికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎంఈఓ బాబు సింగ్, ఉపాధ్యాయులు అశోక్, యాకూబ్ అలీ, నరసింహ రాజు, జిల్లా గ్రంధాలయ సంస్థ ఉప గ్రంథపాలకులు కె. కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

