ఇక రైల్వే టిక్కెట్ బుకింగ్ ఈజీ

జాతీయం టెక్నాలజీ తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

ఇక రైల్వే టిక్కెట్ బుకింగ్ ఈజీ
– ఉన్న చోటు నుంచే జనరల్ టిక్కెట్‌
– స్మార్ట్ ఫోన్‌ నుంచే పొందే సదుపాయం
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: రైల్వే ప్రయాణికులకు భారత రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఆన్‌లైనే జనరల్ టిక్కెట్ పొందేలా యాప్‌ సేవలను అందుబాటులోకి తీసుకవచ్చినట్లు వెల్లడించింది. గతంలో రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు రిజర్వేషన్‌ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటారనే విషయం తెలిసిందే. అయితే నాన్‌ రిజర్వ్‌ టిక్కెట్లను కచ్చితంగా రైల్వే స్టేషన్‌లో ఉండే టిక్కెట్‌ కౌంటర్‌ వద్దే తీసుకోవాల్సి ఉంటుంది. ఆసమయంలో భారీగా క్యూ లైన్ ఉండడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. దీనిని పరిష్కరించేందుకు రైల్వే శాఖ దృష్టిసారించింది. జనరల్‌ టిక్కెట్‌లు ఇక మరింత సులభంగా పొందేలా చర్యలు చేపట్టింది. ఇండియన్‌ రైల్వే ఆధ్వర్యంలో ఇప్పటికే యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్‌లోనే ఈ యాప్‌ ద్వారానే జనరల్‌ టిక్కెట్‌లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ యాప్‌ ద్వారా ప్రయాణీకులు సాధారణ టిక్కెట్‌లతో పాటు, నెలవారీ పాస్‌లు, ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ ద్వారా బుక్‌ చేసుకునేవచ్చు. ఇప్పటి వరకు కేవలం 5 కి.మీటర్ల పరిధిలో ఉండే మాత్రమే ఈ సదుపాయాన్ని పొందేవారు. తాజాగా ఈ పరిధిని 20 కి.మీటర్ల పరిధికి పెంచారు. దీంతో ప్రయాణికులు స్టేషన్‌కు 20 కి.మీల దూరం నుంచే టిక్కెట్‌లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

టిక్కెట్లను ఎలా బుక్‌ చేసుకోవాలంటే..
ముందుగా స్మార్ట్‌ ఫోన్‌లో యూటీఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం బుకింట్‌ టికెట్‌పై క్లిక్‌ చేసి, జనరల్‌ బుకింగ్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. అనంతరం మీరు బయలుదేరే స్టేషన్‌, గమ్యస్థానంతో పాటు ప్యాసింజర్‌ లేదా ఎక్స్‌ప్రెస్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. చివరిగా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాలి. దీంతో స్క్రీన్‌పై మీకు టికెట్‌ ప్రత్యక్షమవుతుంది.