కంటికి శాశ్విత భరోసా

ఆరోగ్యం తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

కంటికి శాశ్విత భరోసా
– సర్కారు ఆసుపత్రుల్లో కంటి వెలుగు సేవలు
– కొత్త నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: కంటి సమస్యలతో బాధపడే పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు పథకం అమలులో ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే మొదటి విడత తరువాత వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రెండో విడత ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కంటి వెలుగు సేవలను శాశ్వితం చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో శాశ్విత కంటి వెలుగు సేవల కేంద్రాలను అందుబాటులోకి తెచ్చే విధంగా దృష్టిసారిస్తోంది. 2018 ఆగస్టు 15న తెలంగాణ సర్కారు కంటి వెలుగు తొలి విడత కార్యక్రమాన్ని ప్రారంభించింది. సుమారు 7-8 నెలల పాటు కంటి వెలుగు ద్వారా 9,887 గ్రామాల్లో మొత్తం 1,54,71,769 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. దీర్ఘకాలంగా నేత్ర సమస్యలతో వేలాధి మంది ప్రజలు బాధపడుతున్నారని.. గుర్తించి వైద్య సేవలను అందించారు. అయితే రోగులు లబ్ధి పొందుతున్నా.. తర్వాత కాలంలో నేత్ర వైద్య సౌకర్యాలు సమీపంలో లేకపోవడం పెద్దలోటుగా మారింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రంలో రెండోవిడతగా వచ్చే జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో దాదాపు 1.54 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి.. దృష్టి సమస్యలను చక్కదిద్దబోతున్నారు.

ఆసుపత్రుల్లోనే కంటి వెలుగు శిబిరాలు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ‘కేసీఆర్‌ కంటి వెలుగు కేంద్రాల’ను శాశ్వత ప్రాతిపదికన నెలకొల్పాలని నిర్ణయించింది. మూడేళ్లకోసారి క్షేత్రస్థాయిలో ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని నిర్వహించినా.. నిరంతరం నేత్ర సమస్యలను పరిష్కరించేలా శాశ్వత కేంద్రాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. బోధనాసుపత్రుల్లో ఎలాగూ నేత్ర వైద్య నిపుణులు ఉంటారు కనుక.. అన్ని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ నేత్ర వైద్య నిపుణులు, ఆప్టోమెట్రిస్ట్‌లను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. ఈ కేంద్రాలలో దూరదృష్టి, హ్రస్వదృష్టి, శుక్లాలు, ఇన్‌ఫెక్షన్లు, ఇతర సమస్యలకు చికిత్స అందిస్తారు. ఆపరేషన్‌ అవసరమైతే సమీపంలోని పెద్దాసుపత్రికి పంపిస్తారు. ప్రతి రోగి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చుతారు. ప్రజలకు కేంద్రాలు నిత్యం అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ఆరోగ్యశాఖను ఆదేశించింది.