పది పేయిల్‌ అయినా.. డాక్టరే..!

ఆరోగ్యం క్రైం తెలంగాణ హైదరాబాద్

పది పేయిల్‌ అయినా.. డాక్టరే..!
– పదేళ్లుగా ప్రజలకు వైద్యం
– నకిలీ వైద్యుడి నాటకానికి తెర
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: సారు పది కూడ పాస్ కాలేదు. పేయిల్‌ అయినా సరే డాక్టర్నే అంటూ పదేళ్లుగా పేదలకు వైద్యం అందిస్తున్నాడు. వచ్చిన వైద్యంతో సేవలు. రాని వైద్యానికి కమీషన్ల కింద కార్పోరేట్ ఆసుపత్రులకు పంపి పబ్బం గడుపుకుంటున్నారు. నిఘా ఉంచిన టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఫేక్ డాక్టర్ నాటానికి తెరదించారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన ఆకాశ్‌కుమార్‌ బిశ్వాస్‌ పదో తరగతి కూడా ఉత్తీర్ణత కాలేదు. కొంతకాలం తన తాత వద్ద ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్న అతను పదేళ్ల క్రితం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లికి వచ్చి ఓ క్లినిక్‌ను ప్రారంభించాడు.

‘ఐఏఎమ్‌ (ఇండియన్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌)’ పేరిట బోర్డు పెట్టుకుని.. రోగులకు అల్లోపతి, ఆయుర్వేద మందులతో చికిత్సలు అందిస్తున్నాడు. గత పదేళ్లుగా అతను 3,650 మందికి పైగా రోగులకు చికిత్సలు అందించినట్లు పోలీసులు గుర్తించారు. రోగుల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే కమీషన్‌ ప్రాతిపదికన వరంగల్‌లోని వివిధ ఆసుపత్రులకు పంపించేవాడు. ఈ విషయమై అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం క్లినిక్‌లో తనిఖీలు చేశారు. అతనివద్ద తగిన అనుమతి, విద్యార్హత పత్రాలు లేనట్లు గుర్తించారు. వివిధ పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ నకిలీ వైద్యున్న పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ జితేందర్‌ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు నరేష్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రావణ్‌కుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధీర్‌, వైద్యాధికారులు సాంబయ్య, భాస్కర్‌ తదితరులను అభినందించారు.