నోరుజారితే.. ఖబడ్దార్..!
– మా కౌన్సిలర్లు మద్దతిస్తేనే చైర్‌పర్సన్ కుర్చీ
– కార్మికులతో చిల్లర రాజకీయాలు చేసింది మీరే
– దొంగ చైర్మన్ కీర్తితో పార్టీకి భ్రష్టు పట్టించారు
– అధిష్టాన నిర్ణయానికి ఇంకా కట్టుబడి ఉంటాం
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సొంత పార్టీ కౌన్సిలర్లపై నోరుజారితే ఖబడ్దార్ అంటూ తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్‌ను వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు హెచ్చరించారు. మా వర్గం కౌన్సిలర్లు మద్దతిస్తేనే చైర్ పర్సన్ సీటు దక్కించుకున్న మీరు కార్మికులతో చిల్లర రాజకీయాలు చేశారని విమర్శించారు. పీఆర్సీ అమలు కోసం కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింపజేయడంపై చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వైస్ చైర్ పర్సన్ అండ్ గ్రూపు అంటూ చేసిన విమర్శనలను ఆమె ఖండించారు. గురువారం దీపా నర్సింలు మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్, కౌన్సిలర్లు సంగీత ఠాకూర్, మంకాల రాఘవేందర్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. చైర్ పర్సన్ హోదాలో ఉండి సొంత పార్టీ వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లను గ్రూపులు అంటూ సంబోధించడం పద్దతేనా అంటూ ప్రశ్నించారు. మా వర్గం కౌన్సిలర్లు చేతులెత్తి మద్దతు ఇస్తేనే చైర్ పర్సన్ సీటు దక్కించుకున్నారనే విషయాన్ని మరిచిపోయారా అని అన్నారు. అర్హత లేదంటూ తమపై వాఖ్యలు చేసిన చైర్ పర్సన్ కార్మికుల సమ్మెలో పాల్గొని ఆస్కార్ లెవల్‌లో సీరీయల్ ఫవామెన్స్ ఇచ్చిరని ఎద్దేవా చేశారు. కార్మికులు పిచ్చొల్లు కాదని అన్నారు. సమ్మె చేపట్టిన ఐదు రోజుల్లో సమ్మె విరించేందుకు కార్మికులు సిద్దమైతే కావాలనే కార్మికులను రెచ్చగొట్టి 20 రోజుల దాకా తీసుకవచ్చారని, సమ్మె కాలానికి చెందిన కార్మికుల వేతనాలు మీరు చెల్లిస్తారని అంటూ ఎదురుదాడి చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాలతో కార్మికుల సంక్షేమం, పట్టణ వాసుల ఆరోగ్యం కోసం సమ్మెను విరమింప జేస్తే చైర్ పర్సన్ గ్రూపు రంగు రాజకీయాలకు తెరలేపారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని చెడగొడుతున్నారని.. భ్రష్టు పట్టిస్తున్నారని చైర్ పర్సన్ చేసిన వాఖ్యలు అర్థరహితమన్నారు. రెండున్నరేళ్ల ఒప్పందాన్ని దిక్కరించి.. పార్టీ నేతలకు వ్యతిరేకంగా వెళ్లిన విషయాలను అందరు గమనిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా పోకడలు సాగిస్తున్న మీరు పార్టీని ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎన్నికల్లో దొంగ ఓటు వేసి పార్టీని భష్ట్రుపట్టించింది మీరే అని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నామని చైర్ పర్సన్ వాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. అభివృద్ధిని ఎక్కడ అడ్డుకున్నామో చూపించాలని సవాల్ చేశారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. కార్మికుల జోలికి వెళ్తే చుట్టుముట్టడం ఖాయమన్నారు. మరోసారి పార్టీ కౌన్సిలర్లపై నోరుజారితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. అదేవిధంగా చైర్ పర్సన్ పదవి ఒప్పందంలో ఇప్పటికీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, పట్టణ అభివృద్ధికే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
మాకు వైస్ చైర్ పర్సనే.. చైర్ పర్సన్
అంతకుముందు మాజీ వైస్ చైర్మన్, కౌన్సిలర్ ఆసిఫ్, సంగీత ఠాకూర్, మంకాల రాఘవేందర్‌లు మాట్లాడుతూ చైర్ పర్సన్‌గా పట్టణ అభివృద్ధికి పాటుపడాల్సింది పోయి అక్రమాలకు.. అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కార్మికుల సమ్మెను విరమింప జేస్తే అభినందించాల్సి ఉంటే నిందలు వేయడం, కార్మికులకు మద్దతు ఇస్తున్నట్లు రెచ్చగొట్టడం సిగ్గుచేటన్నారు. చైర్ పర్సన్‌గా కొనసాగాల్సిన అర్హత ఆమెకు లేదన్నారు. అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ చొరవతోనే చైర్ పర్సన్ అయ్యారనే విషయాన్ని మరించి.. ఈరోజు ఆయనపైనే విమర్శలు చేయడం తగిన పద్దతి కాదన్నారు. రెండున్నరేళ్ల ఒప్పందం మేరకు మాకు ఆమె చైర్ పర్సనే కాదన్నారు. మాకు వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలే చైర్ పర్సన్ అని పేర్కొన్నారు. చైర్ పర్సన్‌కు చిత్తశుద్ది ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సింధూజ నరేందర్ గౌడ్, అశ్విని గుండప్ప, ఎర్రం వసంత, ముక్తార్ నాజ్, అస్లాం, భీంసింగ్, ఉర్దూఘర్ మాజీ చైర్మన్ అబ్దుల్ సలీం తదితరులు పాల్గొన్నారు.

