ఐపీపీబీ పాలసీలు పేదలకు వరం

ఆరోగ్యం జాతీయం తెలంగాణ హైదరాబాద్

ఐపీపీబీ పాలసీలు పేదలకు వరం
– రూ.396లకే రూ.10 లక్షల బీమా
– ఖాతాదారులే అర్హులు
– ఇంకా విషయాలను తెలుసుకోండి
దర్శిని డెస్క్ : ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతో.. ఏ ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం. కుటుంబ పెద్ద దిక్కు కోల్పోతే ఆ కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలసిన వారు.. బంధువులు అప్పటిపూర్తికి ఆదుకున్నా.. తరువాత కాలం కష్టకాలమే. అలాంటి పేదలను ఆదుకునేందుకు ఇండియా తపాల పోస్టు పేమేంట్ బ్యాంకు(ఐపీపీబీ) వరం లాంటి రెండు పాలసీలను కొనసాగిస్తోంది. అందులో ఒకటి రూ.396లు, రెండోది రూ.399ల పాలసీలు. టాటా గ్రూప్‌ యాక్సిడెంటల్‌ గార్డు పాలసీ, బజాజ్‌ అలియాంజ్‌ సంస్థలు అందజేస్తున్న ఈ పాలసీలను తపాలా శాఖ ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. ఈ రెండింటిలో ఏది తీసుకున్నా రూ.10 లక్షల బీమా ఆ కుటుంబానికి అందుతుంది. ఐపీపీబీ (ఇండియా తపాలా పోస్టు పేమెంట్‌ బ్యాంకు)ద్వారా ఈ పాలసీలు పొందవచ్చు. 16 నుంచి 65 ఏళ్ల వయసు వరకూ ఈ పాలసీలో చేరవచ్చు. ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంకులో ఖాతా ఉన్నవారు అర్హులు. ఈ బీమాను తీసుకోవాలనుకుంటే.. నేరుగా ఐపీపీబీ శాఖలున్న తపాలా కార్యాలయాలకు గాని, లేదంటే గ్రూపుగా చేరాలనుకుంటే తపాలా సిబ్బందే నేరుగా వస్తారని తపాలా అధికారులు చెప్పారు.

రూ. 399ల పాలసీ విధానం ఇలా
* టాటా గ్రూప్‌ యాక్సిడెంటల్‌ గార్డు పాలసీ(రూ.399)లో పాలసీదారుడు ఏదైనా ప్రమాదంలో చనిపోయినా.. శాశ్వత అంగవైకల్యం వచ్చినా, పక్షవాతం సంభవించినా రూ.10 లక్షలు ఆ వ్యక్తి పేర్కొన్న నామినీకి అందుతుంది. చదువుకొనే ఇద్దరు పిల్లలుంటే రూ.లక్ష రుణం కూడా ఇస్తారు. 24 గంటలకు పైగా ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటే రూ.60 వేల వరకూ బిల్లు చెల్లిస్తారు. 24 గంటలలోపు ఆసుపత్రి నుంచి వైద్యం తీసుకుని బయటకు వచ్చేస్తే రూ.30 వేలు లేదా వాస్తవ బిల్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది ఇస్తారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి లేదా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేరుకోవడానికి గరిష్ఠంగా రూ.25 వేలు లేదా బిల్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది ఇస్తారు. ఒక వేళ మృతి చెందితే రూ.5 వేలు అంత్యక్రియలకు అందిస్తారు.

* రూ.396 చెల్లించి బజాజ్‌ అలియాంజ్‌ ద్వారా ప్రమాద బీమా తీసుకుంటే ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు రూ.10లక్షల బీమా సొమ్ము అందుతుంది. బజాజ్‌ అలియాంజ్‌లో అయితే ప్రమాదం ఎలా జరిగినా బీమా మొత్తం అందుతుంది.