రేపు లేదా ఎల్లుండి ఇండియాకు శివదత్త మృతదేహం

క్రైం తాండూరు తెలంగాణ వికారాబాద్

రేపు లేదా ఎల్లుండి ఇండియాకు శివదత్త మృతదేహం
– చొరవ చూపిన మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి
– స్వదేశానికి తీసుకవచ్చేందుకు ఏర్పాట్లు
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: యూఎస్‌లో మృతి చెందిన తాండూరు వైద్య విద్యార్థి శివదత్త మృతదేహాన్ని రేపు లేదా ఎల్లుండి ఇండియాకు తీసుకరాబోతున్నారు. తాండూరుకు చెందిన శివదత్త మిస్సోరి సరస్సులో గల్లంతై మరణించిన విషయం తెలిసిందే. తాండూరు పట్టణంలోని అపెక్స్ హాస్పిటల్ యజమాని వెంకటేశం, జ్యోతిల రెండో కుమారుడు శివదత్త(25)లో యూఎస్‌ మిస్సోరిలోని సెయింట్ లూయిస్ యూనివర్సీటి(ఎస్‌ఎల్‌యూ) యూనివర్సిటిలో డెంటల్‌ కోర్సు చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం శివదత్త అతని స్నేహితుడుతో సలి మిస్సోరిలోని ఓజార్క్ సరస్సు(లేక్) వద్ద ప్రమాద వశాత్తు నీట మునిగి ఇద్దరు మునిగిపోయారు. యూఎస్ నిబంధనల ప్రకారం శివదత్త మృతదేహాన్ని అప్పగించడంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో బాధితులు వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్‌కు తెలపడంతో ఆయన స్పందించి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మంత్రులు కేటీఆర్, సబితారెడ్డిలు ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడినట్లు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. దీంతో రేపు మంగళవారం లేదా బుధవారం శివదత్త మృతదేహం ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కుమారుడు మృతితో తల్లిదండ్రులు తీవ్ర విషాధంలో మునిగి ఉండగా వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.