తాండూరుకు మెడికల్ కాలేజీని సాధించుకుందాం
– రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించిన సంఘాలు
– ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు త్వరలో అడహక్ కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాజకీయాలకు అతీతంగా పోరాడి తాండూరుకు మెడికల్ కాలేజీని సాధించుకుందామని పలు స్వచ్ఛంద సంఘాలు, వ్యాపార సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. బుధవారం తాండూరు పట్టణంలోని ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్‌లో రామకృష్ణ సేవ సమితి, మహా సేవ, యూత్ వెల్ఫేర్, వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 2018 నవంబర్25న తాండూరులో జరిగిన ప్రజా ఆశీర్వాదా సభలో తాండూరులో ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇందులో భాగంగా 2019 ఆక్టోబర్‌లో తాండూర్, సంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్ లల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారని తెలిపారు. ఆ తర్వాత మే 2021లో 4 కళాశాలల ప్రతిపాదన 6కు(సంగారెడ్డి, కొత్తగూడెం, మంచిర్యాల,వనపర్తి, మహబూబాబాద్, జగిత్యాల) పెంచి, అందులో తాండూరు పేరును తొలగించారని అన్నారు. మే నెలలో క్యాబినెట్ సమావేశం అనంతరం మళ్ళీ 6 కళాశాలలతో పాటు నాగర్ కర్నూల్ ను చేర్చి 7కళాశాలలుగా మార్చి ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. ఇక చివరగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం 7కళాశాలతో పాటు రామగుండం పేరును చేర్చి 8కళాశాలల ప్రతిపాదనలు కేంద్రానికి పంపిన దాంట్లో కూడా తాండూరు పేరు లేకపోవడం బాధాకరం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో తాండూరు నుంచి యేడాదికి సుమారు 150కోట్ల ఆధాయాన్ని అందిస్తుందని తెలిపారు. అయినా ప్రభుత్వం తాండూరుకు అన్యాయం చేస్తుందన్నారు. తాండూరులో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 350 బెడ్లతో కూడుకున్న జిల్లా ఆసుపత్రితో పాటు మాత శిశు కేంద్రం ఇక్కడే ఉన్నాయన్నారు. తాండూరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనూకూల వసతులు ఉన్నాయని అన్నాగు.
కాబట్టి తాండూరులో ప్రభుత్వ మెడికల్ మరియు నర్సింగ్ కళాశాల సాధనకు తాండూరుకు చెందిన అన్ని స్వచ్చంద , వ్యాపార సంస్థలు, ప్రజాప్రతినిధులను కలుపుకొని కలిసి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. త్వరలోనే మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య ప్రకాష్, మహాసేవ గోపాలకృష్ణ, తాండూర్ యూత్ ప్రెసిడెంట్ కమల్ అతహర్, గంజ్ అసోసియేషన్ అధ్యక్షులు పటేల్ రాంరెడ్డి, రాజ్ కుమార్ కందుకూరి, బాల్ రెడ్డి,వాసు, అశోక్ కుమార్, పటేల్ విజయ్ కుమార్, జమాతే ఇస్లామి హింద్ అధ్యక్షులు ఫహిం ఖాన్, జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అజార్ మౌలానా, సలీం, గౌస్ బాబా, తాండూర్ ముస్లిం వెల్ఫేర్ కార్యదర్శి ఉస్మాన్ గని, పర్యాద రామకృష్ణ, ప్రవేట్ స్కూల్ అసోసియేషన్ కార్యదర్శి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

