కొత్త చట్టాల అమలు, అవగాహనపై దృష్టి
– ఈనెల 10వ తేది వరకు కార్యక్రమాలు
– ట్రాఫిక్ పోలీస్టేషన్ స్థలం ఏర్పాటుకు కృషి
– చోరీలు, మత్తు ప్రదార్థాల రవాణాపై ఫోకస్
– వికారాబాద్ జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి
– తాండూరు పోలీస్టేషన్ తనిఖీ, పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకవచ్చిన కొత్త చట్టాలను అమలు చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని పట్టణ పోలీస్టేషన్ను జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సందర్శించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి పోలీస్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్ లో ఉన్న వసతులను పరిశీలించారు.

పట్టణంలో శాంతి భద్రతల పరిస్థితులు, నేరాలు వంటి అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకవచ్చిన కొత్త చట్టాలు భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, భారతీయ సాక్ష్య అధినియమ్-2023పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈనెల 10వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్టేషన్ లలో అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ప్రజలకు కొత్త చట్టాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 14 బృందాలలో సుమారు 600ల మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ చట్టాలతో గాయాలు ఉన్న కేసుల్లో సత్వర చర్యలు ఉంటాయని. రూల్స్ ప్రకారం మిగతా వారికి వెలుసుబాటు ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లాలో మత్తు పదార్థాల రవాణాపై ఫోకస్ పెడుతున్నామని, దానిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చోరీల కేసులలో త్వరితంగా పురోగతి చేసి. అన్ని కేసులను పరిష్కరిస్తామన్నారు. దీంతోపాటు తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో కూడా శాంతి భద్రతలపై దృష్టి సారించడం జరుగుతుందన్నారు.

తాండూరులో ట్రాఫిక్ పోలీస్టేషన్ ఇప్పటికే మంజూరు కావడం జరిగిందని, ట్రాఫిక్ పోలీస్టేషన్ ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించేలా జిల్లా కలెక్టర్ కు నివేధిక అందిస్తామన్నారు. అంతేకాకుండా తాండూరు సబ్ డివిజన్ పరిధిలో పోలీసుల ఖాళీలపై దృష్టి సారించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ కాశినాథ్, సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి…

