చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి మృతి

క్రైం తాండూరు వికారాబాద్

చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి మృతి
– చెరువులో తేలాడిన మృతదేహం
– బషీరాబాద్‌ మండలంలో వెలుగులోకి
తాండూరు, దర్శిని ప్రతినిధి: మూడు రోజుల క్రితం చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి నాలుగో రోజు శవమై తేలాడు. స్థానికులు గమనించి చెరువులో తేలాడుతున్న మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంలో వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. మండలంలోని బాద్లాపూర్ తాండాకు చెందిన చెందిన హీర్యా నాయక్ గత నెల నవంబర్ 29న చేపలు పట్టేందుకని సమీపంలోని చెరువుకు వెళ్లాడు. అప్పటి నుంచి హీర్యా నాయక్ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గురువారం బషీరాబాద్‌ పోలీసులకు హీర్యా నాయక్ అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం తాండా సమీపంలోని చెరువులో తేలాడుతున్న మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. కుటుంబ సభ్యులు గమనించి హీర్యానాయక్‌గా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. ఈ మేరకు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.