ఫస్ట్ పరుగు..!
– ఎస్సై, కాని4స్టేబుల్ ఈవెంట్లలో మార్పులు
– పరుగెత్తక పోతే ఇంటీకే..
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: పోలీసుశాఖలో భర్తీ చేస్తున్న ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల ఎంపికలో టీఎఎస్‌ఎల్‌పీఆర్‌బీ మార్పులు చేసింది. డిసెంబర్ 8 నుంచి ప్రారంభంకానున్న ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఈవెంట్ల నిర్వహణలో కొత్త విధానంలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. గతంలో అభ్యర్థుల శారీరక కొలతల్ని తీసుకునేవారు. పురుషుల్లో అభ్యర్థుల ఎత్తు, ఛాతి కొలతలు, మహిళా అభ్యర్థుల ఎత్తును కొలిచేవారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారిని మాత్రమే ఈవెంట్లలో పాల్గొనేందుకు అవకాశం కల్పించేవారు. మహిళా అభ్యర్థులకైతే 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్ ఈవెంట్లను నిర్వహించేవారు. వీటిల్లో ఏవైనా రెండింటిలో అర్హత సాధిస్తే సరిపోయేది. శారీరక కొలతల్లో అర్హత పొందిన పురుష అభ్యర్థులు 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 800 మీటర్ల పరుగు పోటీలు నిర్వహించేవారు. ఈ ఈవెంట్లలో మొదటి పోటీలో అర్హత సాధించకపోయినప్పటికీ తదుపరి పోటీలను నిర్వహించి.. మొత్తం 5 ఈవెంట్లలో ఏవేని మూడింటిలో ఉత్తీర్ణులైన వారిని సెలెక్ట్ చేసేవారు. డిసెంబర్ 8 నుంచి ప్రారంభంకానున్న ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఈవెంట్ల నిర్వహణలో కొత్తగా వడబోత విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 12 కేంద్రాల్లో తొలుత పరుగుపందెం నిర్వహించనున్నారు. పురుషులు 1600 మీటర్లు, మహిళలు 800 మీటర్ల పరుగును నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేయవల్సి ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణులైనవారికి మాత్రమే తదుపరి ప్రక్రియ అయిన శారీరక కొలతలకు అనుమతించనున్నారు. ఇక దీనిలో ప్రమాణాలకు అనుగుణంగా కొలతలుంటే లాంగ్‌జంప్, షాట్‌పుట్ పోటీలకు అనుమతిస్తారు. వీటిల్లో నెగ్గినవారు మాత్రమే ఫైనల్ రాతపరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ పరుగును నిర్ణీత సమయంలో పూర్తి చెయ్యలేకపోతే.. మిగతా ఈవెంట్లలో పాల్గొనే అవకాశం ఉండదు. వెనుదిరగవల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈసారి పురుష అభ్యర్ధులకు ఛాతి కొలతలు కూడా తొలగించారు.

