విద్య, వైద్యాన్ని జాతీయం చేస్తేనే బీసీలకు న్యాయం
– హక్కుల సాధనకు బీసీలు ఐక్యంగా ఉద్యమించాలి
– బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్
– తాండూరులో అట్టహాసంగా బీసీ విద్యార్థి, యువత పోరుయాత్ర
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం జాతీయం చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ విద్యార్థి, యువజన సంఘాల రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం తాండూరు పట్టణంలోని ఎంపీటీ హాల్లో బీసీ విద్యార్థి, యువత పోరుయాత్ర సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూపుతుందన్నారు. 12 లక్షల మంది పేద బడుగు వర్గాల విద్యార్థులకు మూడేళ్లుగా స్కాలర్ షిఫ్, ఫీజు రియంబర్స్ మెంట్ ప్రకటించక పోవడంతో బీసీ విద్యార్థులను విద్యకు దూరం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో బార్లను మూడి బడులను తెరవాలన్నారు. విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గానికి కాలేజీలు, యూనివర్సీటీలను నిర్మించాలన్నారు. ఐఐటీ, ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా బీసీలకు రాయితీలను కల్పించి రాజ్యాధికారాన్ని శాశ్వితం చేసుకోవాలని చూస్తోందన్నారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలు పార్టీల జెండాలకు అతీతంగా పనిచేయాలన్నారు. బీసీలకు రాజ్యాధికారం వస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. అదేవిధంగా సమావేశంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మాజీ అధ్యక్షులు మురళీకృష్ణగౌడ్, బీజేపీ నాయకులు ఎం.నరేష్, యు.రమేష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ బీసీలు, యువత రాజ్యాధికారం కోసం ఉద్యమించాలన్నారు.

మరోవైపు బీసీ విద్యార్ధి యువజన సంఘాల ఆధ్వర్యంలో పాలమూరు నుంచి పట్నం వరకు 33 జిల్లాలో చేపట్టిన పోరుయాత్రకు బీసీ విద్యార్థి, యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పట్టణంలోకి ప్రవేశించిన పోరుయాత్రకు బైక్ ర్యాలీతో స్వాగతించి ముందుకు సాగారు. ర్యాలీలో భాగంగా ఇందిరా చౌరస్తాలో జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కు భారీ గజమాలతో సత్కరించారు. అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకుని అక్కడ అంబేద్కర్ నిగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీ ఎంపీటీ హాల్ వరకు ఉత్సహాంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యాం, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, కేంద్ర అధ్యక్షులు విక్రమ్ గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవికృష్ణ, విద్యావంతుల వేదిక నాయకులు పర్యాద రామకృష్ణ, నర్సింహా నాయక్, అనిల్ కుమార్, వీరేశం, శ్రీకాంత్, శివగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

