రైల్వే అండర్ బ్రిడ్జిని వేగవంతం చేయించండి
– పీఏసీ సభ్యుల బృందంతో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని పాత తాండూరు ప్రాంతంలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి విషయాన్ని వేగవంతం చేసేలా చూడాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికుల సౌకర్యాల కమిటి(పీఏసీ) సభ్యుల బృందానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం తాండూరు రైల్వే స్టేషన్‌ను పీఏసీ సభ్యుల బృందం సందర్శించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ రైల్వేస్టేషన్‌కు చేరుకుని పీఏసీ సభ్యుల బృందంతో భేటీ అయ్యారు.

సభ్యుల బృందానికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ స్థానిక రైల్వేస్టేషన్ ఇబ్బందులు, అవసరాల గురించి ప్రస్తావించారు. ఇందులో భాగంగానే తాండూరు నుంచి పాత తాండూరు వెళ్లే మార్గంలో గత కొన్నేళ్ల నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. రైల్వే అండర్ బ్రిడ్జి, ఫ్లైఓవర్ లేకపోవడంతో పాత తాండూరు వాసుల అత్యవసర పరిస్థితుల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వివరించారు. వీలైనంత త్వరగా రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను దూరం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తికి పీఏసీ సభ్యుల బృందం సానుకూలంగా స్పందించినట్లు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పేర్కొన్నారు.

