ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల డేట్లు ఫిక్స్
– మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు తుది పరీక్షలు
– ప్రకటించిన తెలంగాణ పోలీసు నియామక మండలి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలపై రాష్ట్ర పోలీసు నియామక మండలి వేగం పెంచింది. ఈనెల 5తో ప్రస్తుతం జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షలు ముగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియామక పక్రియలో భాగంగా ఎస్సై, కానిస్టేబుల్ తుది పరీక్షల తేదీలను ఫిక్స్ చేసింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు అన్ని తుది పరీక్షలను పూర్తిచేసేందుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఏర్పాట్లు చేసింది. సివిల్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్, ఫింగర్ ప్రింట్ పోస్టులకు వేర్వేరుగా తేదీలను వెల్లడించింది. మార్చి 12న ఉదయం ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్సై అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష, మధ్యాహ్నం ఫింగర్ ప్రింట్ ఏఎస్సై అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష జరగనుంది. మార్చి 26న ఉదయం ట్రాన్స్‌పోర్ట్ ఎస్సై టెక్నికల్ పరీక్ష, ఏప్రిల్ 2న ఉదయం కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు టెక్నికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం కానిస్టేబుల్, మెకానిక్ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షను కేవలం హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఎస్సై తుదిపరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా.. ఏప్రిల్ 8న సివిల్, ఐటీ, ట్రాన్స్‌పోర్ట్ ఎస్సై, ఫింగర్ ప్రింట్ విభాగం ఏఎస్సై అభ్యర్థులకు మొదటి రెండు పేపర్లను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్థమెటిక్, రీజనింగ్.. మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంగ్లిష్ పరీక్ష జరగనుంది. ఏప్రిల్ 9న ఉదయం సివిల్ ఎస్సై అభ్యర్థులకు మూడో పేపర్ జనరల్ స్టడీస్, మధ్యాహ్నం తెలుగు లేదా ఉర్దూ పరీక్షలు జరగనున్నాయి. ఎస్సై తుది పరీక్షలకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సివిల్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏప్రిల్ 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష నిర్వహిస్తారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్, డ్రైవింగ్ టెస్టులకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.

