జాతీయ కీర్తికి భంగం..!
– తాండూరులో రద్దయిన సామూహిక వేడుకలు
– సర్వత్రా వెలువెత్తిన విమర్శలు
– ఖండించని అధికారులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో జాతీయ పతాక కీర్తికి భంగం వాటిళ్లడం తీవ్ర దుమారమైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సామూహిక జెండా వందన వేడుకలు రద్దు కావడం తీవ్ర విమర్శల వెళ్లవకు దారి తీసింది. ప్రతి యేడాది తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ, గణతంత్ర దినోత్సవ వేడుకలను సామూహికంగా నిర్వహించడం ఆనవాయితీ. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాండూరు తహ సీల్దార్ ఆధ్వర్యంలో సాముహిక వేడుకలు నిర్వహిస్తారు. ఈ సాముహిక వేడుకలలో గౌరవ వందనం స్వీకరించడం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, గణతంత్ర దినోత్సవంపై సందేశాలు ఇవ్వడం సంప్రదాయం. కాని గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆర్డీఓ అశోక్ కుమార్ ద్వారా జాతీయ పతాకావిష్కరణ గావించి మమః అనిపించారు. అయితే ఒకరోజు ముందు సామూహిక వేడుకలను ఘనంగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సందేశాలను పంపించారు. సరిగ్గా గణతంత్ర దినోత్సవ వేడుకల గంట ముందు అనూహ్యంగా కార్యక్రమాలను రద్దు చేశారు. విద్యార్థులను ఎవ్వరిని సామూహిక వేడుకలకు తీసుకరావద్దని ఆఘ మేఘాల మీద మేసేజ్ లు, ఫోన్లు చేసి వేడుకలను నిలిపివేశారు.

వేడుకలను రద్దు చేయడం పట్ల దేశభక్తులు, రాజకీయ, కుల సంఘాల, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాన్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాసంస్థల యజమన్యాలు తీవ్ర విమర్శలు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనమైనవో భవితరాలకు తెలపడంతో సామూహిక వేడుకలు కీలకంగా నిలుస్తాయని. ఇప్పుడు వాటిని ఎలాంటి కారణాలు చూపకుండా రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవితరాలకు ఇలాంటి సమాధానాలు ఇవ్వడం దౌర్భాగ్యంగా మారిందని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరోవైపు సామూహిక జాతీయ పతాకావిష్కరణలో వేల మంది దేశభక్తులు, నేతలు, అధికారులు, విద్యార్థులతో కళకళలాడే కాలేజీ మైదానం బోసి పోయింది.

వేడుకలను తిలకించేందుకు వచ్చిన ఎంతో మంది విద్యార్థులు, చిన్నారుల తల్లిదండ్రులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇంత జరిగినా అధికారులు గాని, నేతలు గాని విమర్శలను ఖంఢించక పోవడం గమనార్హం.

