వైభవంగా రథసప్తమి
– దస్తగిరిపేట్‌లో శేషవాహనంపై శ్రీవారి ఊరేగింపు
– పాల్గొని దర్శించుకున్న భక్తులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు తిరుపతి దస్తగిరే పేట్ శ్రీ దేవీ భూదేవి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా ఆలయంలో సతీసమేతంగా వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అలంకరణలు చేశారు. ఈ వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయంలో సప్తమి శోభ సంతరించుకుంది. వేడుకలలో భాగంగా శేషవాహనంపై శ్రీవారిని ఊరేగింపు నిర్వహించారు. శ్రీవేంకటేశ్వర స్వామి నామస్మరణతో ఆలయం మార్మోగింది. భక్తులు భజన కీర్తనలు అలరించాయి. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరోవైపు ఆలయంలో వార్షికోత్సవ వేడుకలను కూడ భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, పూజారులు, పట్టణ ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

