రేపు మంత్రుల రాక కోసం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు మంత్రుల రాక కోసం..!
– పకడ్బందీ ఏర్పాట్ల పరీశీలన
– తాండూరుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి రాక
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నేతలు ఉరుకులు పరుగులు పెట్టారు. వికారాబాద్‌ జిల్లాలోని తాండూరుకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మొదటి సారి విచ్చేస్తున్నారు. ఆయనతో పాటు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్లు కూడ రాబోతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి చేతుల మీదుగా తాండూరు ప్రసిద్దికి చిహ్నమైన కందికి వచ్చిన భౌగోళిక గుర్తింపు(జీఐ) పత్రాన్ని అందజేయనున్నారు. అదేవిధంగా తాండూరు మండలం అంతారం గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేదికను మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రారంభించున్నారు. దీంతో పాటు యాలాల మండలం దౌలాపూర్ గ్రామంలో పీఏసీఎస్ గోదాంల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాండూరుకు విచ్చేస్తున్న మంత్రుల పర్యటన ఏర్పాట్లను వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు పర్యవేక్షించారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం వద్ద ఏర్పాట్లను తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ సీఐలు రాజేందర్ రెడ్డి, రాంబాబులతో కలిసి పరిశీలించారు. అంతారంలో రైతు వేదిక ప్రారంభ ఏర్పాట్లను కూడ పరిశీలించారు. వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ మంత్రి ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. మరోవైపు వికారాబాద్‌ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ తాండూరు ఏడీ రుద్రమూర్తి, ఏఓ రజితలతో కలిసి రైతు వేదిక ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు, నేతల హడావుడితో సందడి వాతావరణం ఏర్పడింది.