ధరణిపై స్పెషల్ ఫోకస్
– ఎక్కడికక్కడ పరిష్కారానికి చర్యలు
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ
– తహసీల్దార్లకు, మీసేవా కేంద్రాలకు ఆదేశాలు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నారాయణరెడ్డి తన మార్కు పరిపాలనను ప్రారంభించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై ప్రాధాన్యమిస్తారని కలెక్టర్ నారాయణరెడ్డికి మంచి గుర్తింపు ఉంది. జిల్లాలోని రైతులకు జిల్లా కలెక్టర్ శుభవార్త ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి సమస్యలపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా దృష్టిసారించారు. ముఖ్యంగా ధరణి విషయంలో అవస్థలు, ఇబ్బందులు పడుకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీలైన సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరించేలా తహసీల్దార్ అధికారులకు, మీసేవా నిర్వహకులకు అదేశాలు జారీ చేశారు. ధరణి సమస్యలను పారదర్శకంగా పరిష్కరించేలా పలు సలహాలు, సూచనలు అందించారు.
జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలు ఇలా
ప్రతి తహశీల్దార్ కార్యాలయంలో సహాయక కేంద్రం ఏర్పాటు చేయాలి. అందులో అవగాహన ఉన్న ఉద్యోగిని నియమించాలి. కేంద్రానికి వచ్చే రైతుల నుంచి సమస్యను తెలుసుకుని సమస్య పరిష్కరించగలిగిందా లేదా సివిల్ కిందకు వస్తుందా అనే విషయాలను తెలుసుకోవాలి. పరిష్కరించగలిగేది అయితే దానికి చర్యలు తీసుకోవాలని, సివిల్ సమస్య అయితే కోర్టులో పరిష్కరించుకునేలా చూడాలని రైతులకు నచ్చజెప్పాలి. తహసీల్దార్లు ధరణి హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి.. దానిపై విస్తృత ప్రచారం నిర్వహించాలి. ప్రతి సోమవారం ధరణి సమస్యలపై ప్రజావాణి నిర్వహించాలి. తహసీల్దార్లు ధరణి ఫిర్యాదులను స్వీకరించాలి. దీంతో పాటు ప్రతి మీసేవా కేంద్రం నిర్వహకులు కూడ ధరణి హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసుకోవాలి. తహసీల్దార్లు మీసేవా అపరేటర్లకు ధరణి పోర్టల్‌పై అవగాహన కల్పించాలి. దీంతో నిర్వహకులు రైతులకు సమస్యలను క్షుణ్ణంగా వివరించే అవకాశం ఉంటుంది. తహసీల్దార్లు, మీసేవా నిర్వహకులు ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి.

