రైల్వే ఆస్తుల అమ్మకపు యత్నాన్ని విరమించుకోవాలి
– వార్నింగ్ డేలో నిరసన తెలిసిన రైల్వే కార్మికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మోడీ ప్రభుత్వం రైల్వే ఆస్తులను అమ్ముకునే ప్రయత్నం చేస్తోందని, ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూరు యూనియన్(ఎసీఆర్ఎంయూ) తాండూరు శాఖ నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ సంపత్తి అమ్మకానికి వ్యతిరేకంగా మంగళవారం ఎస్సీఆర్ ఎంయూ కమిటి పిలుపు మేరకు బుధవారం తాండూరు రైల్వేస్టేషన్ వద్ద నాయకులు, కార్మికులు వార్నింగ్ డేలో భాగంగా నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మోనటైజేషన్ పేరుతో రైల్వే ఆస్తులను ప్రవేటు పరం చేసేందుకు యత్నిస్తుందని ఆరోపించారు. దాదాపు రూ. 6 లక్షల కోట్లను సమీకరించుకునేందుకు కుట్ర చేస్తుందన్నారు. భారతీయుల రైల్వే ఆస్తులను దోచుకునే విధానాలను సహించబోమన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం మోనిటైజేషన్ విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్ఎంయూ తాండూరు శాఖ అధ్యక్ష, కార్యదర్శులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
