బీజేపీ నేత ఇంటి వద్ద భీభత్సం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

బీజేపీ నేత ఇంటి వద్ద భీభత్సం
– మురళీకృష్ణ గౌడ్ నివాసంపై రాళ్లతో దాడి
– అర్దరాత్రి వేళ చుట్టుముట్టిన యువకులు
– అదుపుచేసేందుకు వచ్చిన పోలీసులకు ఎదురు
– లాఠీ జులింపించి అదుపు చేసిన పోలీసులు
– వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఉద్రిక్తత
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్, బీజేపీ నేత మురళీకృష్ణ గౌడ్ ఇంటి వద్ద అర్దరాత్రి భీభత్సం జరిగింది. కొందరు యువకులు ఇంటిపైకి వచ్చి రాళ్లతో దాడి చేశారు. ఇంట్లో ఉన్నవారిపై కూడ దాడి చేసి గాయపరిచారు. సోమవారం అర్దరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన తాండూరులో ఉద్రిక్తతను రేపింది.

తాండూరు నియోజకవర్గం యాలాల మండలం దేవనూర్ గ్రామంలో జరిగిన శివస్వాముల ఘటనలో మురళీకృష్ణ గౌడ్‌ రిమాండుకు వెళ్లి సోమవారం రాత్రి బేయిల్‌పై విడుదలై తాండూరుకు వచ్చారు. అంతకుముందు పరిగి జైలు వద్ద మురళీకృష్ణ గౌడ్ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై సంచనల, వివాదాస్పద వాఖ్యలు చేశారు. ఇది జీర్ణించుకోలేని ఎమ్మెల్యే అనుచరులు అర్దరాత్రి తాండూరు పట్టణంలోని మురళీ కృష్ణ గౌడ్ నివాసాన్ని ముట్టడించారు. ఇంట్లోకి రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ధ్వంసం అయ్యాయి. దీంతో పాటు వరుస దాడులతో ఇంట్లో ఉన్న పలువురుకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసలు మురళీకృష్ణ గౌడ్ నివాసానికి చేరుకున్నారు. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికి యువకులు పోలీసులపై ఎదురుదాడి చేసేందుకు యత్నించారు. దీంతో పరిస్థితి ఉదృక్తితంగా మారింది. వెంటనే పోలీసులు లాఠీ జులిపించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు మురళీకృష్ణ గౌడ్ తాండూరు ఎమ్మెల్యేపై చేసిన వాఖ్యలకు భేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన మంగళవారం తాండూరులో తీవ్ర చర్చనీయాంశమైంది.