భారత్‌కు భూకంపాల ముప్పు
– భారీగా సంభవించే అవకాశం
– హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు, నిపుణులు
దర్శిని డెస్క్: ప్రపంచంలోని భారత దేశానికి కూడ భూకంపాల ముప్పు ఉందని శాస్త్రవేత్తలు, నిపుణులు అంచనా వేస్తున్నారు. విపత్తులు ఎప్పుడైనా జరగొచ్చని హెచ్చరికలు చేస్తున్నారు. తుర్కియే, సిరియా దేశాలలో భూప్రళయాలు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. వేలాది మందిని పొట్టనపెట్టుకోవడంతో పాటు వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలి ప్రభావిత ప్రాంతాలు నామరూపాల్లేకుండా పోయాయి. భారత్‌లో కూడ భారీ భూకంపాలు సంభవించే ప్రమాదాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. భారత భూగర్భంలో చోటుచేసుకొంటున్న పలు మార్పుల కారణంగా భవిష్యత్తులో చోటు చేసుకోవచ్చని అంటున్నారు. ఈ మద్యకాలంలో మన దేశంలోని హర్యానా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అక్కడక్కడా కూడా భూకంపాలు జరిగిన సంఘటనలు చోటుచేసుకొంటుంటాయి. వాటి తీవ్రత తక్కువగా నమోదవుతుండటంతో ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఎప్పటికీ అలాంటి ప్రభావాలు ఉండకపోవచ్చని, ఖచ్చితంగా భారీ భూకంపాలు జరగవచ్చని చెబుతున్నారు. ప్రధానంగా హిమాలయాల సమీప ప్రాంతాల్లో భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్కడి భారత భూభాగ పైపొరల్లోని టెక్టోనిక్ ప్లేట్లు ప్రతి ఏడాది 5 సెంటీమీటర్ల మేర కదులుతున్నాయని, ఇది హిమాలయాల వెంబడి ఒత్తిడికి దారితీస్తున్నదని, తద్వారా రాబోవు రోజుల్లో హిమాలయ పర్వతాల సమీప ప్రాంతాల్లో భారీ భూకంప ఘటనలు సంభవించే ప్రమాదాన్ని పెంచుతున్నదని హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన చీఫ్ సైంటిస్టు, భూకంప శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు హెచ్చరించారు. హిమాలయ పర్వతాలకు సమీపంలో ఉండే హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, పశ్చిమ నేపాల్ ప్రాంతాల్లో ఏ సమయంలోనైనా భారీ భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందన్నారు.

