వారమైనా మోక్షం లేదాయో..!
– డ్రైన్ తవ్వకంలో భగీరథ పైపులైన్ ధ్వంసం
– తాగునీటికి తంటాలు పడుతున్న ప్రజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వారం రోజుల క్రితం జరిపిన తవ్వకం.. తాండూరు పట్టణ వాసులకు తంటాలు తెచ్చి పెట్టింది. ప్రజలు రోడ్డుపై రాకపోకలతో పాటు కాలనీలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. తాండూరు పట్టణంలో ప్రస్తుతం ఇందిరా చౌరస్తా నుంచి కోడంగల్ రోడ్డు మార్గంలో రెండో విడత రోడ్డు విస్తరణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో బస్టాండ్ సమీపంలోని శాంతినగర్ కాలనీకి వెళ్లే మార్గంలో డ్రైన్ పనుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాలతో కాలనీకి తాగునీటిని సరఫరా చేసే పైపులైన్ ధ్వంసమైపోయింది. ఇదంతా వారం రోజుల క్రితం జరిగింది. ఇప్పటికి వారం పూర్తయిన డ్రైన్ పనులు గాని, పైపులైన్ మరమ్మత్తుల పనులు గాని చేపట్టలేదు. దీంతో వారం రోజులుగా శాంతినగర్ కాలనీలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి మరమ్మత్తులకు చర్యలు చేపట్టాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

