అడిగేస్తే చాలు..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

అడిగేస్తే చాలు..!
– వాయిస్‌తోనే రైల్వేటిక్కెట్‌ బుకింగ్
– కొత్త వ్యవస్థ తెస్తోన్న ఐఆర్‌సీటీసీ
– ఎలా పనిచేస్తుందంటే..?
దర్శిని ప్రతినిధి: ఒకప్పుడు రైల్వే ఎక్కడికైనా వెళ్లాలంటే.. స్థానిక రైల్వే స్టేషన్‌కు వెళ్లి బారులు తీరి టిక్కెట్టు పొందేవారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చి.. వేగంగా విస్తరించడంతో ఇంట్లో నుంచే రైల్వే టిక్కెట్లను బుక్‌ చేసుకునే సదుపాయాలు వచ్చాయి. ఇప్పుడేమో రైల్వే టిక్కెట్లు పొందడం మరింత ఈజీ మారబోతోంది. ఎంతలా అంటే నోటితో అడిగేస్తే చాలు.. బుకింగ్‌ చేసుకునే సదుపాయం రాబోతోంది. ఆన్‌లైన్‌లో రైల్వేటిక్కెట్లను బుకింగ్ చేసుకునే వ్యవస్థలో ఐఆర్‌సీటీసీ ముందుంటుంది. తాజాగా ఫ్లాట్‌ఫాంలో ఈ-టికెట్ వ్యవస్థను తీసుకవస్తోంది. ఈ-టికెటింగ్‌ విధానంతో ఐఆర్‌సీటీసీ ఇప్పటికే పరీక్షలను ప్రారంభించింది. పలు నివేదికల ప్రకారం తొలి దశ పరీక్షలు విజయవంతం అయ్యాయి. మరికొన్ని దశల పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వినియోగదారుల సందేహాల నివృత్తి కోసం ‘ఆస్క్‌ డిశా’(డిజిటల్ ఇంటరాక్షన్ టు సీక్ హెల్ప్ ఏనీటైం) పేరుతో చాట్‌ బాట్‌ను ఆవిష్కరించిన ఐఆర్‌సీటీసీ.. ఇప్పుడు ఈ చాట్‌ బాట్‌ అత్యాధునిక ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ను అనుసంధానించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. దీని ద్వారా ప్రయాణికుడు నోటితో కమాండ్‌ ఇవ్వడం ద్వారా ఈజీగా టికెట్‌ బుక్‌ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తున్నారు. అన్నీ కుదిరితే వచ్చే మూడు నెలల్లోపు వాయిస్‌ ఆధారిత టికెట్‌ బుకింగ్‌ ని ఆవిష్కరించేందుకు ఐఆర్‌సీటీసీ కసరత్తు చేస్తోంది. దీనిని వాయిస్‌ సెంట్రిక్‌ ఈ-టెకెటింగ్‌ అని అంటారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సమయం ఆదా..
ఆన్‌లైన్‌లో రైలు టికెట్‌ను బుక్ చేయడానికి సగటు ప్రయాణికుడికి చాలా సమయం వృథా అవుతోంది.ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కి లాగిన్ చేసి, అందులోని ఫారమ్‌లో ప్రయాణికుల పేరు, ఇతర వివరాలు నమోదు చేసి సబ్మిట్‌ చేయాల్సి వస్తోంది. దీని వల్ల చాలా సమయం వృథా అవుతోంది. ఫలితంగా మనం టికెట్‌ బుకింగ్‌ కోసం ప్రయత్నం ప్రారంభించినప్పుడు సీటు ఖాళీ కనిపించినా.. ఈ ఫారం అంతా పూర్తి చేసి పేమెంట్‌చేసే సమయానికి వెయిటింగ్‌ లిస్ట్‌ లోకి వెళ్లిపోతోంది. దీనిని పరిహరించేందుకు అత్యాధునిక ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మీ వివరాలు నోటితో చెప్పడం ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

ఆస్క్ దిశా 2.0 ఫీచర్లు
చాట్‌బాట్ ‘ఆస్క్ దిశ 2.0’ సహాయంతో ప్రయాణికులు టికెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఈ చాట్‌బాట్ హిందీ లేదా ఇంగ్లిష్‌లో ప్రశ్నలు అడగవచ్చు. ఇంగ్లిష్‌లో అయితే ‘యాక్చువల్లీ’ అనే పదంతో చాటింగ్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో కస్టమర్ తన టిక్కెట్‌ను రద్దు చేసుకోవచ్చు. మీరు రద్దు చేసిన టికెట్ల వాపసు స్థితిని కూడా చూడవచ్చు. మీరు మీ పీఎన్‌ఎర్‌ స్థితిని కూడా చూడవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌పై ప్రయాణికులు తాము ఎక్కే స్టేషన్‌ను మార్చుకోవచ్చు. అలాగే డెస్టినేషన్ స్టేషన్‌ని కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు రైలు టికెట్లను ప్రివ్యూ, ప్రింట్, షేర్ చేయవచ్చు. రైలు ప్రయాణానికి సంబంధించిన ఏదైనా ప్రశ్నకు ఈ ప్లాట్‌ఫారమ్‌లో సమాధానం దొరకుతుంది.