ఒత్తిడిని జయించేలా..!
– ఇంటర్ విద్యార్థుల కోసం టోల్ ఫ్రీ నెంబర్
– భయం, మానసిక సమస్యలపై కౌన్సిలింగ్
– జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు
– పకడ్బందీగా ఇంటర్ వార్షిక పరీక్షలు
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: పరీక్షలకు సిద్దమయ్యే ఇంటర్ విద్యార్థులు భయం, ఒత్తిడిని జయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. విద్యార్థుల ఫ్రీ కౌన్సిలింగ్ కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ చేసిందని చెప్పారు. దీంతోపాటు సందేహాల నివృత్తి కోసం జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించిందని తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణలతో కలిసి ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, సంభందిత అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తరువాత జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 15నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేకంగా టెలీ మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 ను ఏర్పాటు చేసిందని తెలిపారు. పరీక్షల సమయంలో ఆందోళనకు, టెన్షన్ కు గురయ్యే విద్యార్థులు 14416 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే మానసిక నిపుణులు, వైద్యులు ఉచిత కౌన్సిలింగ్ నిర్వహిస్తారని వివరించారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని, 040-24601010, నెంబర్ నందు సందేహాల నివృత్తి కోసం సంప్రదించేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ సదుపాయాలపై విద్యార్థుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు.
పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో మొత్తం 30 ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంటర్ మొదటి సంవత్సరంలో 9231 ద్వితీయ సంవత్సరంలో 8657 మంది మొత్తం 17,888 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు త్రాగునీరు, విద్యుత్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని కూడ నియమించడం జరుగుతుందని చెప్పారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద మున్సిపల్, జిల్లా పంచాయతీ అధికారులు పారిశుద్ధ్యంతో పాటు త్రాగునీటి సదుపాయం కల్పించాలని అదేశించారు. విద్యార్థులు పరీక్షలకు సకాలంలో హాజరయ్యే విధంగా అన్ని రూట్లలో బస్సులను సకాలంలో నడపాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఉదయం 8:30 గంటల నుండి పరీక్ష కేంద్రాలలో అనుమతించడం జరుగుతుందని, విద్యార్థులందరూ 8:45 గంటలకు చేరుకోవాలని, 9:00 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలలో అనుమతించబడదని కలెక్టర్ సూచించారు.
హాల్ టిక్కెట్లకు ఇబ్బందులు పెడితే..
విద్యార్థులు నేరుగా tsbie.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా తమ హాల్ టికెట్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా హాల్ టికెట్లు అందించాలని అన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే స్టేట్ టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ నెంబర్ 040-24601010, 24655027 లకు సంప్రదించాలని అన్నారు. జిల్లా కేంద్రంలో కూడా విద్యార్థులకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం జరిగిందని 9642831424, 9963356062 లను కూడా సంప్రదించవచ్చని అన్నారు.

