దొంగ సంతకాలతో దగా.!
– అడ్వయిజరీ కమిటీ అనుమతితో అసోసియషన్ ఎన్నికలు
– అక్రమాలపై బహిరంగ చర్చకు, న్యాయ పోరాటానికి సిద్ధం
– ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కొత్త కార్యవర్గ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దొంగ సంతకాలతో ముస్లిం వెల్ఫేర్ ఆహాసియేషన్ను దగా చేస్తున్నారని అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో నూతన అధ్యక్షులు కమల్ అతహర్, కార్యవర్గ సభ్యులు మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త కార్యవర్గం ఎన్నిక చెల్లదంటూ ప్రధాన కమిటీ పేరుతో ఖుర్షీద్ హుస్సేన్, హాది షహేరీలు చేసిన ఆరోపణలను ఖండించారు. 1997 నుంచి రిజిస్ట్రేషన్ అయిన ఆసోసియేషన్కు ప్రతి రెండు సంవత్సరాలు ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. అడ్వయిజరీ కమిటీ ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తుందన్నారు. 2023 కార్యవర్ల పదవీ కాలం ముగిసిన తరువాత కొత్త కమిటిని ఎన్నుకోకుండా ఖుర్షీద్ హుస్సేన్, హాది షహేరీలు తామే కొత్త కార్యవర్గంగా ఏర్పాటైనట్లు రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. గత కార్యవర్గం పదవి కాలం ముగిసినట్లుగా తీసుకున్న సంతకాలతో తామే కొత్త కమిటీగా ఏర్పాటు అయినట్లు దొంగ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఐదేళ్ల వరకు పాలకవర్ల పదవికాలం ఉంటుందని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అన్నారు. ఈ విషయంపై వివాదం తలెత్తడంతో అడ్వయిజరీ కమిటీ ఆధ్వర్యంలో దానిని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించారని గుర్తుచేశారు. ఇందుకు ఎన్నికల అధికారిగా మాజీ అధ్యక్షులు అబ్దుల్ ఆహాద్ ను కూడ ఎన్నుకున్నారని, ఈ మేరకు ఈనెల 14న మదీనా మసీదులో ఆసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయన్నారు. అధ్యక్షులుగా కమల్ అతహర్, కోశాధికారిగా యూనుస్ లు ఏకగ్రీవంగా ఎన్నికకాగ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు జరిగాయని, ఇందులో ఖాలీద్ పైఫ్ ఉల్లా ఎన్నిక కావడం జరిగిందని వివరించారు. ఎన్నికలు జరిగిన తరువాత కొత్త కార్యవర్గంపై తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. తమ ఎన్నిక చెల్లదని చేసిన ఆరోపణలతో పాటు సభ్యత్వ నమోదు విషయంలో చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. అంతేకాకుండా చేసిన ఆరోపణలపై న్యాయపోరాటానికి కూడ సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు బాబర్, సభ్యులు బాసిత్ అలీ, అబ్దుల్ ఖయ్యూం, సోహైల్ ఉమ్రి, ఫారూఖ్ ఖురేషి, హిదాయత్ ఉల్లా షరీఫ్, ఖాలీద్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్, ఎండీ సలీం, అబ్దుల్ హమీద్, అబ్దుల్ ఖవి, అసద్ అలీ, పాషా ఖురేషీ, ఖయూమ్ అతహర్, ఎండీ సిరాజ్, ఎండీ అజహర్ తదితరులు పాల్గొన్నారు.

