ఫ్లైఓవర్ రోడ్డు యాక్సీడెంట్లో ట్విస్ట్..!
– దొంగలించిన లారీతో యాక్సిడెంట్
– పోలీసుల విచారణలో వెలుగులోకి
– లారీ చోరీపై కరణ్‌కోట్ పోలీస్టేషన్లో కేసు నమోదు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఫ్లైఓవర్ బ్రిడ్జీ రోడ్డు వద్ద జరిగిన యాక్సీడెంట్లో ట్విస్ట్ ఏర్పడింది. కొందరు వ్యక్తులు దొంగిలించిన లారీతో ఈ రోడ్డు ప్రమాదానికి కారుకులు అయ్యారని తాండూరు పట్టణ పోలీసుల విచారణలో తేలింది. బుధవారం తెల్లవారు జామున తాండూరు పట్టణం ఫ్లైఓవర్ బ్రిడ్జి కోడంగల్ రోడ్డు మార్గంలో బైకును లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ అబ్దుల్ రవూఫ్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన కోళ్ల కృష్ణ నల్గొండ జిల్లాలో పీజీ చదువుతున్నాడు. మంగళవారం అతని మామ అక్కం లాలప్ప చనిపోవడంతో హాజీపూర్ వచ్చాడు.
బుధవారం హైదరాబాద్‌లో పరీక్ష ఉండగా తెల్లవారు జామున అదే గ్రామానికి చెందిన దంతేవాడ లాలప్ప (30), చెన్నారం నరేష్ లతో కలసి బైకుపై తాండూరు రైల్వే స్టేషన్‌కు బయల్దేరారు. పట్టణ సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు రాగానే అక్కడ ఉన్న ఓ పెట్రోల్ బంకు నుంచి రాకేట్ లారీ బయటకు వచ్చింది. అదే సమయంలో ఆ లారీ వీరి బైకును ఢీ కొట్టేక్రమంలో తప్పించుకుని ముందుకు వెళ్లారు. వెంటనే లారీ వెనుక నుంచి వీరి బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో బాలప్ప తలకు, చెయ్యికి, కడుపులో గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైకుపై ఉన్న కృష్ణ, నరేష్ లకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికులు వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ప్రమాదానికి కారణమైన లారీని తాండూరు మండలం కరణ్ కోట్లో కొందరు వ్యక్తులు దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. కరణ్ కోట్ పోలీస్టేషన్లో కూడా లారీ అదృశ్యమైనట్లు కేసు నమోదైనట్లుగా పోలీసులు చెబుతున్నారు. దొంగలించిన లారీని పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిప్పినట్లు, ప్రమాదం అనంతరం లారీని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద వదిలినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కూడా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి…

