డబుల్ ఊపు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

డబుల్ ఊపు..!
– సొంతింటి కోసం పెరిగిన దరఖాస్తులు
– రెండో రోజు ఎంతమంది చేసుకున్నారంటే
– మొత్తం 5,028కి చేరిన దరఖాస్తుల సంఖ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి : సొంతింటిని సొంతం చేసుకోవాలని డబుల్‌ బెడ్‌ రూం లబ్దిదారులు ఊపుమీద ఉన్నారు. తాండూరు పట్టణంలో డబుల్ బెడ్ రూం దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు మంగళవారం దరఖాస్తుల సంఖ్య పెరిగింది. మొదటి రోజు 2,196 దరఖాస్తులు అందితే రెండో రోజు 2,832 దరఖాస్తులు అందాయి. దీంతో రెండు రోజుల్లోనే డబుల్ బెడ్‌ రూం దరఖాస్తుల సంఖ్య 5,028కు చేరింది. మంగళవారం కూడా లబ్దిదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు దరఖాస్తులు చేసుకున్నారు. డబుల్ బెడ్ రూం దరఖాస్తుల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రెండో దరఖాస్తుల సంఖ్య ఇలా ఉంది. పట్టణ ఆరోగ్య కేంద్రంలో 670, కొత్త మున్సిపల్ కార్యాలయంలో 504, పాత తాండూరు బస్తీ దవాఖానలో 680, రైతుబాజర్లో 366, పాత మున్సిపల్ కార్యాలయంలోని 1 కేంద్రంలో 258, రెండో కేంద్రంలో 354 మంది దరఖాస్తులు అందించినట్లు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు వివరించారు. వచ్చేనెల 1వ తేదీ వరకు లబ్దిదారులు దరఖాస్తులు సమర్పించుకోవచ్చని సూచించారు. శ్రీరామ నవమి సెలవు సందర్భంగా దరఖాస్తులు తీసుకోవడం జరగదని స్పష్టం చేశారు.