సెల్‌ ఫోన్‌ పోతే పట్టేసుకుంటారు..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

సెల్‌ ఫోన్‌ పోతే పట్టేసుకుంటారు..!
– కొత్త వ్యవస్థను తెస్తోన్న కేంద్ర టెలికాం
– చోరీల నియంత్రణకు కసరత్తు
– ఎలా పనిచేస్తుందంటే..?
దర్శిని డెస్క్‌: సాంకేతికత విస్తరించిన ప్రపంచంలో దాదాపు ప్రతి ఒక్కరు సెల్‌ ఫోన్‌ వినియోగిస్తున్నారు. ఎన్నో అవసరాలను తీర్చే సెల్‌ ఫోన్‌ పోతే ఆందోళనకు గురికావడం జరుగుతుంది. పోలీసులకు ఆశ్రయిస్తే పోయిన ఫోన్‌ వస్తుందో లేదో అనే మరో ఆందోళన చెందుతారు. కొన్ని సందర్భాలలో స్వయం కృతాపారాధం ఫోన్‌ పోగొట్టుకుంటే చాలా సమాయాల్లో కేటుగాళ్ల చోరీల వల్ల పోగొట్టుకోవడం చూస్తుంటాం. ఫోన్‌ చోరీపై ఫిర్యాదు చేస్తే…. రసీదు మాత్రమే ఇస్తారు. ఈ దొంగలను పట్టుకునే సాంకేతిక వ్యవస్థ లేకపోవడంతో పోలీసులు పెద్దగా ఏమీ చేయలేకపోతున్నారు. ఇకపై అలాంటి దానికి చెక్‌ పెట్టేలా కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. సీఈఐఆర్‌ వ్యవస్థ ద్వారా ఒప్పందం చేసుకుని కొత్త వ్యవస్థ అమలుకు కసరత్తు చేస్తోంది. ఎవరైనా ఫోన్‌ను చోరీ చేసిన దొంగలు వెంటనే స్విచ్‌ ఆఫ్‌ చేస్తారు. దాన్ని ఇతర రాష్ట్రాలకు పంపి అక్కడ విక్రయిస్తారు. లేదంటే అందులోని విడిభాగాలను తీసి ఎగుమతి చేస్తుంటారు. దాంతో పోలీసులు ఫోన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండటంలేదు. ఐఎంఈఐ నంబరు ద్వారా ఫోన్‌ ఎక్కడుందన్నది తెలుసుకోవచ్చు. విడిభాగాలుగా ఊడదీస్తే మాత్రం తెలుసుకోవడం అసాధ్యం. ఇతర రాష్ట్రాల్లో అమ్మితే ఎక్కడుందో తెలుస్తుంది. కానీ… ఒక్క ఫోన్‌ని స్వాధీనం చేసుకోవడానికి అక్కడికి పోలీసు బృందాన్ని పంపడం వ్యయప్రయాసలతో కూడుకుంది.

సీఈఐఆర్‌తో దొంగను పట్టుకోవచ్చు
ప్రస్తుతం ఐఎంఈఐ నంబరు ద్వారా తమ ఫోన్‌ ఎక్కడుందో బాధితులు సొంతంగా తెలుసుకోగలుగుతున్నా… దాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్ళడానికి వారు జంకుతున్నారు. వీటన్నింటికీ దృష్టిలో ఉంచుకొని సీఐడీ విభాగం సీఈఐఆర్‌తో ఒప్పందం చేసుకుంది. ఇకపై ఫోన్‌ చోరీ కేసులను పోలీస్‌ స్టేషన్లలో నమోదు చేస్తారు. ఫోన్‌ పొగొట్టుకున్న బాధితుడు ఫోలీసులకు ఫిర్యాదు ఇచ్చి, కేసు నమోదైన తర్వాత సీఈఐఆర్‌ వెబ్‌సైట్లో సంబంధిత వివరాలను నమోదు చేస్తారు.

చోరీ అయిన ఫోన్‌ను ఐఎంఈఐ నంబరు ద్వారా బ్లాక్‌ చేస్తారు. చోరీ చేసిన వ్యక్తి అందులో వేరే సిమ్‌కార్డు వేస్తే మనకు ఆ విషయం తెలిసిపోతుంది. దాని ద్వారా కొత్త సిమ్‌కార్డు చిరునామాను తెలుసుకుని, దొంగను పట్టుకోవచ్చు. అయితే తప్పుడు ఫిర్యాదులు రాకుండా… ఫోన్‌ కొనుగోలు చేసినప్పటి అసలు రసీదు, వ్యక్తిగత చిరునామా, గుర్తింపు కార్డు, ప్రత్యామ్నాయ ఫోన్‌ నంబరు వంటివి తీసుకుంటారు. ఠాణా నుంచే ఫోన్‌ వివరాలను సీఈఐఆర్‌ వెబ్‌సైట్లో నమోదు చేస్తారు. వెంటనే అది బ్లాక్‌ అవుతుంది. దొంగ ఆ ఫోన్‌ను ఉపయోగించడానికి ఎప్పుడు ప్రయత్నించినా తెలిసిపోతుంది.