సాఫీగా మున్సిపల్ బడ్జెట్ సమావేశం

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

సాఫీగా మున్సిపల్ బడ్జెట్ సమావేశం
– రూ.55.41 కోట్ల అంచనా బడ్జెట్ ఆమోదం
– హాజరైన అడిషనల్‌ కలెక్టర్ రాహుల్ శర్మ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో 2022-23 ఆర్థిక సంవత్సరంతో పాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ సమావేశం సాఫీగా జరిగింది. సోమవారం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తదితరులతో కలిసి హాజరయ్యారు.

ముందుగా 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్పై రూ.80లక్షల మిగులు అంచనా నిల్వతో బడ్జెట్‌ను ఆమోదించారు. రూ.60.28 లక్షల ఆధాయం, రూ.28.77 లక్షల వ్యయంతో అంచనా బడ్జెట్ చూపించారు. పన్నుల రూపంలో రూ. 12.21 కోట్లు, ఇతర ఆదాయం రూ.11.8కోట్లతో రూపొందించారు. నాన్ ప్లాన్ గ్రాంట్లపై అంచనా ఆధాయం రూ.8.55 లక్షలు, ప్లాన్ గ్రాంట్లపై రూ. 2.10 కోట్లు, ఇతర గ్రాంట్లపై రూ.25 కోట్ల 80 లక్షలు ఆధాయంతో అంచనాకు ఆమోదం తెలిపారు.

కొత్త బడ్జెట్ రూ. 55.41 కోట్లకు ఆమోదం
ఆదేవిధంగా 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో రూ.59.12 కోట్ల 5వేల వ్యయంతో పాటు రూ. 55.41 కోట్ల 35వేల ఆదాయ అంచనా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా పాలకవర్గం ఆమోదం తెలిపింది. ఇందులో రూ. 26.09 లక్షలను మిగులు బడ్జెట్ చూపించారు. ఆస్తి పన్నుల రూపంలో రూ. 12.94 కోట్లు, నాన్ ట్యాక్సెస్ నుంచి రూ.8.60 కోట్లు, గ్రాంట్ల నుంచి రూ. 33.07 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఇందులో గ్రీన్ బడ్జెట్ కోసం 10 శాతం నిధులు కేటాయిస్తూ పాలకవర్గం ఆమోదం తెలిపింది. సోమవారం గత ఏడాది. ఈ ఏడాదికి సంబంధించి ప్రవేశ పెట్టిన బడ్జెట్ సమావేశం సాఫీగా సాగింది.

అభివృద్ధిపై దృష్టి: రాహుల్ శర్మ, అడిషనల్ కలెక్టర్
బడ్జెట్ ఆమోదం తరువాత సమావేశానికి హాజరైన జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులపై అందరు దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పనులను చేపట్టాలని సూచించారు.

ఆదర్శంగా నిలుపుతాం: స్వప్న పరిమళ్, చైర్ పర్సన్
గత ఏడాదితో పాటు ఈ ఏడాది బడ్జెట్ను సాఫీగా సాగించుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, కొత్తగా వచ్చిన మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్‌లతో సహాకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. తాండూరును ఆదర్శంగా నిలుపుతామని అన్నారు.

బడ్జెట్ ఆమోదం సంతోషకరం: దీపా నర్సింలు, వైస్ చైర్ పర్సన్
తాండూరు మున్సిపల్ బడ్జెట్ ఆమోదం సంతోష కరమన్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంపై కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్‌కు అనుగుణంగా అధికారులు ప్రగతిని చేసి చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్, ఫ్లోర్ లీడర్లు శోభారాణి, అంతారం లలిత, మధుబాల, సాజిద్, మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ రంగనాధం, ఏఈ ఖాజా, అకౌంటెంట్ వాసవి, కౌన్సిలర్లు అబ్దుల్ రజాక్, పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, మంకాల రాఘవేందర్, సిందూజ గౌడ్, సంగీత ఠాకూర్, సాహు శ్రీలత, బొంబినా తదితరులు పాల్గొన్నారు.