ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తే ఉపేక్షించం

తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తే ఉపేక్షించం
– సర్కారును బద్నామ్ చేసేందుకే లీకేజీ కుట్ర
– తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట‌పాటు చేయాల‌నుకునేది ఎవరైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భ‌వ‌న్‌లో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ల లీకేజీ నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీ వ‌ర‌కు కుట్ర కోణం దాగి ఉంద‌ని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని బద్నామ్ చేసేందుకు ఈ కుట్రలు జరుగుతున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పేప‌ర్ లీకేజీల కుట్ర‌కు పాల్ప‌డ్డార‌ని మంత్రి పేర్కొన్నారు.

మీ స్వార్ధ రాజకీయాల కోసం ఐదు లక్షల మంది విద్యార్ధుల జీవితాలతో చెలగాటం అడుగుతారా..? అని స‌బితా ఇంద్రారెడ్డి మండిప‌డ్డారు. టీఎస్‌పీఎస్పీ పేప‌ర్ లీకేజీ చేసిన రాజశేఖ‌ర్, ప‌దో త‌ర‌గ‌తి పేప‌ర్ లీకేజీలో పాత్ర ఉన్న ప్ర‌శాంత్‌ల‌కు బీజేపీ నాయ‌కుల‌తో సంబంధాలు ఉన్నాయ‌న్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ప‌దో త‌ర‌గ‌తి పేప‌ర్ బ‌య‌ట‌కు తీసుకొచ్చి వైర‌ల్ చేసిన టీచ‌ర్ కూడా బీజేపీ అనుబంధ సంఘం స‌భ్యులు అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకునేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి హెచ్చ‌రించారు.