అన్న ప్రాణం తీసిన తమ్ముడు

క్రైం తాండూరు వికారాబాద్

అన్న ప్రాణం తీసిన తమ్ముడు
– పొలం డబ్బుల విషయంలో గొంతు బిగించి హత్య
– తాండూరు మండలం గోనూర్ గ్రామంలో ధారుణం
– పరిశీలించిన తాండూరు రూరల్ సీఐ రాంబాబు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పొలం డబ్బుల విషయంలో సొంత అన్న ప్రాణాన్ని తమ్ముడు బలితీసుకున్నాడు. దారుణమైన ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో చోటు చేసుకుంది.

పోలీసులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం గోసూర్ గ్రామానికి చెందిన మాచనూరు ఆశప్ప, లాలమ్మల కుమారులు నర్సప్ప, శ్రీనివాస్ (40), శివకుమార్ లకు 9 ఎకరాల పొలం ఉంది. ఇందులో ఒక ఎకరా పొలాన్ని రూ. 40లక్షలకు ఇటీవలే విక్రయించారు. వచ్చిన డబ్బుల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో శుక్రవారం శ్రీనివాస్ పొలంలో పనిచేసుకుంటుండగా శివకుమార్ అక్కడికి వెళ్లి గొడవ పడ్డాడు. గొడవ పెద్దది కావడంతో అన్న శ్రీనివాస్ గొంతుకు శివకుమార్ టవాలుతో బిగించి హత్య చేశాడు. పక్క పొలంలో పనిచేస్తున్న శ్రీనివాస్ భార్య బుజ్జమ్మ, బాబాయిలు గమనించి దగ్గరికి వెళ్లి చూశారు. అప్పటికే శ్రీనివాస్ మృతి చెందాడు. విషయాన్ని పోలీసులకు తెలపడంతో సమాచారం అందుకున్న రూరల్ సీఐ రాంబాబు, కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గోవింద్, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని భార్య బుజ్జమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తామన్నారు. మృతి చెందిన శ్రీనివాస్ కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.