తాండూరు విద్యార్థులకు గుడ్ న్యూస్
– ఆగస్టు నుంచి ఐటీఐ కాలేజీలో అడ్మిషన్లు
– కోర్సులు, దరఖాస్తు విధానం ఎలా ఉందంటే
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రాంత విద్యార్థులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చే ఆగస్టు నుంచి అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు తాండూరు మండలం జినుగుర్తిలో తాత్కాళిక భవనం కూడ అందుబాటులోకి తీసుకవచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2016-17 సంవత్సరంలో తాండూరు మండలానికి వృత్తి శిక్షణ కేంద్రం మంజూరైంది. సొంత భవనం లేకపోవడంతో తాత్కాలికంగా జిన్‌గుర్తి వద్ద రూర్చన్ నిధులతో నిర్మించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. దీంతో జిల్లాలో వికారాబాద్, మర్పల్లి ప్రభుత్వ వృత్తి శిక్షణ కేంద్రాల సరసన మరో కేంద్రం చేరనుంది. తాండూరు మండలానికి మంజూరైన ప్రభుత్వ వృత్తి శిక్షణ కేంద్రం (ఐటీఐ) త్వరలో అందుబాట్లోకి రానుంది.
పదోన్నతులు, నియామకాలు..
వృత్తి శిక్షణ కేంద్రంలో మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. వీటిలో ప్రిన్సిపల్, సూపరింటెండెంట్, రెండు జూనియర్ సహాయక పోస్టులు భర్తీ చేశారు. శిక్షణ అధికారితోపాటు ఐదు ఉప శిక్షణ అధికారి, సహాయ శిక్షణ అధికారి, సీనియర్ సహాయక పోస్టుల్ని పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. మూడు అటెండరు పోస్టులు, రెండు కాపలాదారు పోస్టుల్ని జిల్లా పాలనాధికారి ద్వారా మూడు నెలల్లోగా నియమించనున్నారు.
ముందుగా మూడు కోర్సులు..
2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి అధికారులు అడ్మిషన్లు స్వీకరించే ప్రక్రియను వేగవంతం చేశారు. వచ్చే ఆగస్టు నుంచి దరఖాస్తులను స్వీకరించబోతున్నారు. ముందుగా మూడు కోర్సుల ప్రవేశాలు స్వీకరించేందుకు చర్యలు పూర్తి చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్ కోర్సుల్లో 100 మంది, ఆ తర్వాత ఏటా 200 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. కళాశాల అందుబాటులోకి వస్తే.. వందల మంది విద్యార్థులు ఉచితంగా వృత్తి శిక్షణ పొందే వెసులుబాటు లభించనుంది.
ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు..
తాండూరు ఐటీఐ కాలేజీకి సంబంధించిన అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తామని కాలేజీ ప్రిన్సిపల్ రామానుజ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు సంబంధిత అధికారిక సైట్ నుంచి అడ్మిషన్ల దరఖాస్తులను చేసుకోవచ్చన్నారు. దూరప్రాంత విద్యార్థులు రాయితీతో కూడిన బస్ పాస్, ఉపకార వేతనాలు పొందే వీలుంటుందని అన్నారు. తాండూరు మండల ఐటీఐ తరగతుల్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రం భవనాల్లో ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

