కృష్ణా జలాలు పారిస్తాం..!
– వికారాబాద్, తాండూరుకు పాలమూరు నీళ్లు
– సీఎం కేసీఆర్ ఘనతతో ఇంటింటికి సంక్షేమ పథకాలు
– ఈ విద్యాసంవత్సరం నుంచే మెడికల్ కళాశాల
– రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని ప్రాంతాలకు త్వరలోనే కృష్ణా జలాలను పారించి తీరుతామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చివరి దశకు చేరుకున్నారని, త్వరలోనే టెండర్లను ఆహ్వానించబోతున్నామని స్పష్టం చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని పేర్కొన్నారు. మన తెలంగాణలో ఇంటింటికి మంచినీళ్లు వస్తున్నాయి. ప్రతి ఇంటికి కల్యాణలక్ష్మి, రైతుబంధు పథకాలు అందుతున్నాయి. మనలాంటి పథకాలు పొరుగు రాష్ట్రం కర్ణాటకలో అమలు కావడం లేదని, ఇందుకు అక్కడి ప్రజలు బాధపడుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు ఎరువులు దొరక్క ఇబ్బందులు పడ్డారని హరీశ్‌రావు గుర్తు చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిదేండ్లలో రైతులకు ఇబ్బందుల్లేకుండా ఎరువులు అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలవుతున్న పథకాలు బంద్ అవుతాయన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చివరి దశకు చేరుకుందన్నారు. పాలమూరు పంప్ హౌస్ పనులు దగ్గర పడ్డాయన్నారు. కరివెన, వట్టెం రిజర్వాయర్ల నుంచి వికారాబాద్, తాండూర్‌కు కాల్వల ద్వారా నీళ్లను తీసుకువస్తామన్నారు. ఇందుకు సంబంధించి టెండర్లను పిలవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు హరీశ్‌రావు తెలిపారు. త్వరలోనే వికారాబాద్, తాండూరు ప్రాంతాలకు కృష్ణా జలాలు పారించి తీరుతామన్నారు.
మరోవైపు రాష్ట్రంలో 3 ఆయుష్ ఆస్పత్రులు మంజూరయ్యాయి. అందులో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పట్టుదలతో వికారాబాద్‌కు ఒకటి సాధించడం జరిగిందన్నారు. అదేవిధంగా జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీలో ఈ విద్యా సంవత్సర నుంచి అడ్మిషన్లు ప్రారంభించి తరగతులను కొనసాగించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని గర్బిణీలకు న్యూట్రిషన్ కిట్స్‌ను ఈ నెల నుంచే అందజేస్తామని హరీశ్‌రావు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి కేసీఆర్‌ను గెలిపించి ఆశీర్వదించాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ ఆనంద్, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్, జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ సర్పంచ్ నర్సింహారెడ్డి, మర్పల్లి మండల జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

